Share News

Ramoji Excellence Awards 2025: మహోన్నత వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు

ABN , Publish Date - Nov 16 , 2025 | 08:57 PM

సాధారణ రైతు బిడ్డ స్థాయి నుంచి.. ప్రపంచమంతా తెలుగువారి వైపు చూసేలా ఎదిగిన దివంగత రామోజీ రావు జీవితం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. రామోజీ స్థాపించిన సంస్థల ద్వారా ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం పొందారని..

Ramoji Excellence Awards 2025: మహోన్నత వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు
Ramoji Excellence Awards 2025

హైదరాబాద్, నవంబర్ 16: రామోజీ గ్రూప్‌ సంస్థల వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు మహోన్నత వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలని పలువురు ప్రముఖులు కీర్తించారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో 2025 రామోజీ ఎక్స్‌లెన్స్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు పాల్గొని రామోజీ రావు సమాజానికి చేసిన సేవని గుర్తు తెచ్చుకున్నారు.


ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి రామోజీ రావు చేరుకున్న శిఖరాలు అనితర సాధ్యాలని వారంతా ముక్తకంఠంతో అభివర్ణించారు. రామోజీ రావు జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశ ఉపరాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్, తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు.. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు, బండి సంజయ్‌.. ఇలా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై రామోజీరావు సాధించిన విజయాల్ని గుర్తు చేసుకున్నారు.


పాత్రికేయ రాజర్షి రామోజీరావు: వెంకయ్య నాయుడు

పాత్రికేయ రాజర్షి రామోజీరావు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. అక్షర శక్తికి సరికొత్త నిర్వచనమిచ్చిన రామోజీరావు స్వయం కృషి, క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, కార్యదీక్షతలే ఆయుధాలుగా అనేక రంగాల్లో విజయాలు సాధించి భవిష్యత్‌ తరాలకు మార్గదర్శనం చేశారని కీర్తించారు. తెలుగు ప్రజల గుండెల్లో రామోజీ రావు స్థానం శాశ్వతమని, రామోజీరావులా ప్రజా జీవితంపై ముద్రవేసిన వ్యక్తి ఇటీవలి కాలంలో మరొకరు లేరని కొనియాడారు.


నిబద్ధత కలిగిన వ్యక్తి రామోజీరావు: జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

రామోజీరావు నిబద్ధత కలిగిన వ్యక్తి అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. రామోజీరావు ఎప్పుడూ అధికారాన్ని కోరుకోలేదని, ఎప్పుడూ తన పత్రికను స్వప్రయోజనాల కోసం వాడుకోలేదని చెప్పుకొచ్చారు. సారా వ్యతిరేక, సమాచార హక్కు ఉద్యమాలను రామోజీరావు ప్రోత్సహించారని, ప్రజాస్వామ్య పరిరక్షణలో రామోజీరావు కీలక పాత్ర పోషించారని జస్టిస్ రమణ కీర్తించారు.


రామోజీ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ఆలోచన ప్రశంసనీయం: చంద్రబాబు

రామోజీ గ్రూప్‌ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్స్‌లెన్స్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ప్రశంసనీయమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, మానవ సేవ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కళ-సంస్కృతి, మహిళా సాధికారత, యూత్‌ ఐకాన్‌ విభాగాల్లో అవార్డులివ్వడం హర్షణీయమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమాజసేవలో ప్రజల్ని భాగస్వాములను చేసిన వ్యక్తి రామోజీరావు అని.. ఎలాంటి విపత్తు వచ్చినా తనదైన శైలిలో సేవలు అందించారని చంద్రబాబు తెలిపారు. రామోజీరావు ఒక్క పిలుపు ఇస్తే ప్రజలు బాగా స్పందించేవారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఒక సీఎంగా తెలుగు భాషను కాపాడేందుకు ఏమైనా చేస్తానని.. రామోజీ రావు స్ఫూర్తిగా తెలుగు భాష సంరక్షణ కోసం ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు మాట ఇచ్చారు.


రామోజీ గ్రూప్‌ సంస్థలు తెలంగాణకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి

రామోజీ గ్రూప్‌ సంస్థలు తెలంగాణకు గర్వకారణంగా నిలిచాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ నగరమంటే నాలుగు అద్భుతాలు గుర్తొస్తాయని.. అందులో మొదటిది ఛార్మినార్‌, రెండోది గోల్కొండ, మూడోది హైటెక్‌ సిటీ, నాలుగు.. రామోజీ ఫిల్మ్‌సిటీ అని సీఎం చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ ఆస్కార్‌ అవార్డుల వరకు ఎదిగిందంటే ఇందులో రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎంతో తోడ్పాటునందించిందని సీఎం తెలిపారు. ఉదయం లేవగానే ఈనాడు పేపర్‌ చదవడం.. రాత్రి ఈటీవీ న్యూస్‌ చూసి నిద్రపోవడం తెలుగు ప్రజలకు రామోజీరావు అలవాటుగా మార్చారని రేవంత్ తెలిపారు.


అవార్డులు వీరికే..

ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన, సమాజహితమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏడుగురికి రామోజీ ఎక్స్‌లెన్స్‌ జాతీయ అవార్డులు దక్కాయి. వీరిలో అమలా రూయా (గ్రామీణాభివృద్ధి), శ్రీకాంత్‌ బొల్లా (యూత్‌ ఐకాన్‌), మాధవీలత (సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ), ఆకాశ్‌ టాండన్‌ (మానవసేవ), ప్రసన్న శ్రీ (కళ- సంస్కృతి), జైదీప్‌ హార్దికర్‌ (జర్నలిజం), పల్లవి ఘోష్‌ (మహిళా సాధికారత) ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: రండి బాబూ రండి.. చౌక ధర.. ఐదొందలు టికెట్‌ కొనుక్కో.. ఐదు కోట్ల ఇంటిని సొంతం చేసుకో..

KTR petition: తెలంగాణ స్పీకర్‌పై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్‌.. రేపు విచారణ

Updated Date - Nov 16 , 2025 | 10:09 PM