Bandi Sanjay: హైదరాబాద్‌లో మజ్లీస్ సభకు స్పాన్సర్ కాంగ్రెస్సే : బండి సంజయ్
ABN , Publish Date - Apr 19 , 2025 | 09:15 PM
వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా మజ్లిస్ పార్టీ హైదరాబాద్‌లో నిర్వహించబోయే బహిరంగ సభకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఆర్థిక సహకారం అందిస్తోందని సంజయ్ ఆరోపించారు. హై కమాండ్ ఆదేశాలతో..

Bandi Sanjay: ఆరు నెలల్లో జరిగే జీహెచ్ఎంసీ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎంఐఎంను కూకటివేళ్లతో పీకయడానికే మేం పని చేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని ప్రజలు కోరుకుంటున్నారని సంజయ్ చెప్పుకొచ్చారు. హిందూ దేవుళ్ళను అవమానించిన వారితో కాంగ్రెస్, బీఆరెఎస్‌లు ఎలా కుమ్మక్కవుతాయని ఇప్పటికే ప్రజలు ఆయా పార్టీలపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఒత్తిడి మరింత పెరుగుతుందని, ఆరు నెలల తర్వాత జరిగే కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రజలకు ఇదే గుర్తుకు వస్తుందని బండి సంజయ్ చెప్పారు.
దారుస్సలాంలో నిర్వహిస్తున్న సభ.. కాంగ్రెస్ స్పాన్సర్ సభని సంజయ్ ఆరోపించారు. 77వేల ఎకరాల స్థలం ఉంది .. దాని ద్వారా వస్తున్న ఆదాయంతో ఏ పేద ముస్లింకయినా లబ్ది జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో వక్ఫ్ ఆస్తులు ఎన్ని , ఆదాయం ఎంత , ఎంతమందికి లబ్ది జరిగిందో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా మజ్లిస్ పార్టీ హైదరాబాద్‌లో నిర్వహించబోయే బహిరంగ సభకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్థిక సహకారం అందిస్తోందని సంజయ్ ఆరోపించారు.
భాగ్యనగరంలో సభలు, సమావేశాలు, ఆందోళనల పేరుతో హైదరాబాద్‌లో అల్లర్లకు కాంగ్రెస్ పెద్దలు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే జరిగితే హైదరాబాద్‌లో బెంగాల్ తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్నారు. వెంటనే కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డి సర్కారే బాధ్యత వహించాలని బండి సంజయ్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
NIMS: నిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం..
Minister Ram Prasad Reddy: గుడ్ న్యూస్.. ఆ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు సర్కార్..