Share News

Hyderabad: డీకే అరుణ ఇంట్లో చోరీ.. సంచలన విషయాలు చెప్పిన డీసీపీ..

ABN , Publish Date - Mar 17 , 2025 | 03:13 PM

డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడ్డాడు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా రేపుతోంది. ఇంట్లోకి చొరబడిన దుండగులు.. గంటన్నరపాటు ఇల్లంతా తిరిగాడు. కానీ, ఒక్క వస్తువు కూడా దొంగిలించలేదు.. మరి ఆ దుండగుడు ఎందుకొచ్చాడు.. ఇప్పుడిదే అనేక ప్రశ్నలకు కారణమవుతోంది..

Hyderabad: డీకే అరుణ ఇంట్లో చోరీ.. సంచలన విషయాలు చెప్పిన డీసీపీ..

హైదరాబాద్, మార్చి 17: బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీ కేసు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. అసలు చోరీకి వచ్చిందెవరు.. దొంగే అయితే అతను ఏం ఎత్తుకెళ్లాడు.. ఏకంగా ఎంపీ ఇంట్లోకే అగంతకుడు దూరడం, చోరీ చేయడంతో సెక్యూరిటీ అంశంపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఈ వ్యవహారానికి సంబంధించి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కీలక వివరాలు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి అగంతకుడు ప్రవేశించాడని.. ఈ కేసులో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉపయోగించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. సీపీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అయితే, ఇంట్లోకి చొరబడ్డ దొంగ.. ఎలాంటి వస్తువులు దొంగిలించలేదని డీసీపీ తెలిపారు. అసలు అగంతకుడు ఎందుకు వచ్చాడు అనే విషయంపై విచారణ చేస్తున్నామన్నారు. డీకే అరుణ ఇంటి వద్ద, పరిసర ప్రాంతాల్లో పోలీస్ గస్తీ పెంచుతామన్నారు. విచారణకు అవసరమైన వివరాలను డీకే అరుణ ఇచ్చారని డీసీపీ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు.


మొత్తం వివరాలు చెప్పేసిన డీకే అరుణ..

అగంతకుడు ఇంట్లోకి చొరబడటంపై డీకే అరుణ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం నాడు డీకే అరుణ నివాసానికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారు. ఆమె ఇంటిని పరిశీలించారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అదేవిధంగా ఇంట్లో పని చేసే వర్కర్స్ స్టేట్‌మెంట్ నమోదు చేశారు. ఇక చోరీ వ్యవహారంపై డీకే అరుణ స్పందించారు. జరిగిన మ్యాటర్ అంతా చెప్పేశారు. తమ ఇంట్లోకి ఓ అగంతకుడు ప్రవేశించి అలజడి సృష్టించాడని డీకే అరుణ చెప్పారు. వచ్చిన వ్యక్తి ఇంట్లో ఒక్క వస్తువు కూడా తీసుకుపోలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు కాల్ చేసి మాట్లాడారని ఎంపీ చెప్పారు. తాను 30 ఏళ్లుగా జూబ్లీహిల్స్‌లోనే నివాసం ఉంటున్నానని.. కానీ, ఎప్పుడూ ఇలా జరుగలేదన్నారు. తమకు భద్రత కల్పించాలని సీఎంను కోరినట్లు డీకే అరుణ తెలిపారు. అగంతకుడు రోడ్ నెంబర్ 45లో నుండి తమ ఇంటి వెనుక వైపు నుండి ఎంటర్ అయినట్లు ఎంపీ తెలిపారు. ఉదయం 3.28 గంటలకు ఇంట్లోకి ప్రవేశించి ఇల్లు మొత్తం తిరినినట్లు ఆమె చెప్పారు. కొన్ని కెమెరాలు ఆఫ్ చేసి, గంటన్నర పైగా ఇల్లు మొత్తం తిరిగాడని తెలిపారు. సీసీఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. ఇంట్లోకి అగంతకుడు వచ్చిన సమయంలో తమ మనమరాలు ఇంట్లోనే ఉందన్నారు. అగంతుకుడుని చూసి గట్టిగా అరిచి ఉంటే, అమ్మాయిపైన ఏదైనా దారుణానికి ఒడిగట్టి ఉంటే ఏంటి పరిస్థితి అనే భయంలో తామున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన తరువాత ఇంట్లో పిల్లలు భయపడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి , సీపీ కాల్ చేసి అడిగారని.. జరిగిన విషయం మొత్తం చెప్పానన్నారు డీకే అరుణ. అయితే, ఇంట్లో నుంచి వెళ్లిపోయే ముందు రోడ్ నెంబర్ 45 నుంచి అగంతకుడు నాంపల్లి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఎటు వెళ్లాడనేది ఇంకా క్లారిటీ లేదన్నారు. తనకు ఎవరిపై అనుమానం లేదని.. తమకు ఎవరితోనూ గొడవలు కూడా లేవన్నారు. అగంతకుడు ఎందుకు వచ్చాడనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉందన్నారు ఎంపీ.


పోలీసులు ఏం గుర్తించారంటే..

డీకే అరుణ ఇంట్లో అగంతకుడు చొరబడిన ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీలు ఎంపీ డీకే అరుణ ఇంటికి చేరుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎంపీ ఇంట్లో అగంతకుడు గంటన్నరకు పైగా సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. రోడ్ నెంబర్ 45లో ఆటో తీసుకొని నాంపల్లి రైల్వే స్టేషన్ వెళ్లినట్లు గుర్తించారు. ఇంట్లోకి వచ్చిన అగంతకుడు.. కొన్ని సీసీ కెమెరాలను ఆఫ్ చేశాడు. ఇంటి మొత్తాన్ని రెక్కీ నిర్వహించిన తరువాతే ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. అగంతకుడికి, ఇంట్లో పని చేసే పని మనుషులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.


Also Read:

Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్

Jathvani False Cases: సీఎం, హోంమినిస్టర్.. న్యాయం చేయండి ప్లీజ్

For More Telangana News and Telugu News..

Updated Date - Mar 17 , 2025 | 03:13 PM