Share News

High Court: ధిక్కరణ కేసులో ఐఏఎస్‌‌లపై హైకోర్టు ఆగ్రహం

ABN , Publish Date - Jul 17 , 2025 | 05:12 AM

చేపల సీడ్‌కు సంబంధించిన నగదు చెల్లింపులు చేయాలన్న ఉత్తర్వులను అమలు చేయని ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

High Court: ధిక్కరణ కేసులో ఐఏఎస్‌‌లపై హైకోర్టు ఆగ్రహం

  • చేపల సీడ్‌ నగదు చెల్లింపులో జాప్యంపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): చేపల సీడ్‌కు సంబంధించిన నగదు చెల్లింపులు చేయాలన్న ఉత్తర్వులను అమలు చేయని ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని పశుసంవర్ధకశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సవ్యసాచి ఘోష్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా, మత్స్య శాఖ కమిషనర్‌ ప్రియాంక, డిప్యూటీ డైరెక్టర్‌ టీ శ్రీనివాస్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి కలెక్టర్లకు ఫారం-1 నోటీసులు జారీచేసింది. 2023-24 ఏడాదికి తాము అందజేసిన చేపల సీడ్‌కు నగదు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాకాపురానికి చెందిన పుట్టా ఫిష్‌ సీడ్‌ ఫాం యజమాని బాలరాజు, ఇతర ఫాం యజమానులు గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై మూడు వారాల్లో నిర్ణయం తీసుకుని, పిటిషనర్లకు తెలియజేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయడం లేదని పిటిషనర్లు కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై బుధవారం జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. చెల్లింపుల కోసం పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని పిటిషనర్ల తరఫున న్యాయవాది డీఎల్‌ పాండు తెలిపారు. ప్రతివాదులైన అధికారులు నేరుగా తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా పడింది.


హెచ్‌సీఏ కార్యదర్శి, సీఈవో హాజరవ్వాలని ఆదేశం

ఓ కోర్టు ధిక్కరణ కేసులో తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) కార్యదర్శి ఆర్‌ దేవరాజ్‌, సీఈవో సునీల్‌ బోస్‌కు హైకోర్టు ఫారం-1 నోటీసులు జారీ చేసింది. వర్క్‌ ఆర్డర్‌ మేరకు పనులు పూర్తిచేసినా అంగీకరించిన మొత్తం రూ.19 లక్షలు చెల్లించడం లేదని గంజం డెకార్‌ సర్వీసెస్‌ సంస్థ హైకోర్టులో పిటిషన్‌ వేయగా ఆ మొత్తం చెల్లించాలని తీర్పు వెలువడింది. అయినా చెల్లించడం లేదంటూ పిటిషనర్‌ సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. హెచ్‌సీఏ కార్యదర్శి, సీఈవో తమ ఎదుట ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది.


ఇవి కూడా చదవండి

కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 05:12 AM