Weather Report: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు వానలే వానలు..
ABN , Publish Date - Jul 01 , 2025 | 08:29 AM
Heavy Rainfall Predicted: ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది.

దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఇటీవల కొన్ని రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తరబంగాళాఖాతం, ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలోని 19 జిల్లాల్లో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని ప్రకటించింది. ఇక, ఏపీలోనూ మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలోని ఈ జిల్లాల్లో..
ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని .. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందనివాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
వారికి మస్క్ వార్నింగ్.. అస్సలు వదలి పెట్టనంటూ..