Share News

Godavari River: ఉధృతంగా గోదావరి

ABN , Publish Date - Jul 12 , 2025 | 04:17 AM

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. రెండు నదులపై ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

Godavari River: ఉధృతంగా గోదావరి

  • ఎగువన కురుస్తున్న వర్షాలతో పరవళ్లు

  • సమ్మక్క సాగర్‌, మేడిగడ్డ బ్యారేజీలకు భారీగా వరద.. అన్ని గేట్లూ ఎత్తివేత

  • కొనసాగుతున్న దేవాదుల పంపింగ్‌

  • భద్రాద్రి వద్ద 37.2 అడుగుల నీటిమట్టం

  • నీట మునిగిన స్నాన ఘట్టాలు, షెడ్డు శ్రీశైలంకు 1.77 లక్షలు, జూరాలకు 1.09 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. రెండు నదులపై ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి భారీగా వరద వస్తుండడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరిపై ఉన్న సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి 7,46,410 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. నీటిమట్టం 82.10 మీటర్లు ఉండగా... బ్యారేజీ మొత్తం 59 గేట్లను ఎత్తివేశారు. ఇదే మండలం గుట్టల గంగారం వద్ద చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో 3 మోటార్ల ద్వారా 831 క్యూసెక్కుల నీటిని భూపాలపల్లి జిల్లా భీం ఘనపూర్‌ రిజర్వాయర్‌కు పంపింగ్‌ చేస్తున్నారు. దేవాదుల ఇన్‌టేక్‌ వెల్‌ వద్ద 83.3 మీటర్ల నీటిమట్టం నమోదైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం మేడిగడ్డ బ్యారేజీకి శుక్రవారం 8.68 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. 85 గేట్లను ఎత్తి అంతే నీటిని దిగువకు పంపిస్తున్నారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.60 మీటర్లు ఉంది. మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం సాయంత్రం 11.79 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఇది 12.2 మీటర్లు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఏటూరునాగారం మండలం పుష్కరఘాట్‌ వద్ద గోదావరి పెరుగుతూ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు 14.4 మీటర్లకు చేరింది. 14.82 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వాజేడు మండలంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పూసూరు-ఎడ్జర్లపల్లి, పేరూరు-చండ్రుపట్ల, వాజేడు-గుమ్మడిదొడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 163వ జాతీయ రహదారిపైకి వరద నీరు ప్రవేశించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మంగపేట మండలంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కమలాపురం బిల్ట్‌ ఇన్‌టేక్‌ వెల్‌ వద్ద నీటిమట్టం 8.5 అడుగులకు చేరింది. ఇక భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు 30 అడుగులు ఉండగా.. శుక్రవారం ఉదయం 6 గంటలకు 33.3 అడుగులకు పెరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు 35.4 అడుగులు నమోదై సాయంత్రం 6 గంటలకు 37.2కు చేరింది. భద్రాచలం వద్ద స్నానఘట్టాలతో పాటు మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన షెడ్‌ మునిగాయి. ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల్లో వరద ముంపు తీవ్రత కనిపిస్తోంది. కుక్కునూరు-దాచారం మార్గంలో గుండేటి వాగు కాజ్‌వేపై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలం ఎద్దువాగు కాజ్‌వేపై వరద పెరుగుతుండడంతో 14 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.


కృష్ణమ్మ పరవళ్లు

కృష్ణా నది విషయానికొస్తే... శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శుక్రవారం 1.77 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. మూడు గేట్లు, ఎడమ, కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రాలు, పోతిరెడ్డిపాడు, ఎంజేకేఎల్‌ఐ ద్వారా 1.70 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.89 టీఎంసీల నిల్వ ఉంది. ఆలమట్టి, నారాయణపూర్‌కు కూడా వరద నిలకడగా కొనసాగుతోంది. ఆలమట్టికి 1.11 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా లక్ష క్యూసెక్కులను నారాయణపూర్‌కు వదులుతున్నారు. నారాయణపూర్‌ వద్ద లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా 95,760 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల వద్ద 1.09 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా 1.02 లక్షలను శ్రీశైలంవైపు వదులుతున్నారు. తుంగభద్రకు 41,972 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 40,855 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం సాయంత్రం క్రస్ట్‌ గేట్లను తాకింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా 545.30 అడుగులకు చేరింది. సాగర్‌ పూర్తి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా 199.5466 టీఎంసీలు ఉంది. ఎగువనుంచి 1,24,800 క్యూసెక్కులు సాగర్‌కు చేరుతుండగా 5,244 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.


నేడు, రేపు తేలికపాటి వర్షాలు

తెలంగాణలో శని, ఆదివారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!

అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు

For Telangana News And Telugu News

Updated Date - Jul 12 , 2025 | 04:17 AM