Damodara Rajanarasimha: యంత్రాలకు మరమ్మతులు చేయాలి!
ABN , Publish Date - Jul 08 , 2025 | 03:29 AM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో యంత్ర పరికరాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

ఆస్పత్రుల్లో యంత్రపరికరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
పెద్ద సమస్యలుంటే మూడు రోజుల్లో పరిష్కరించాలి
వైద్య శాఖ సమీక్షలో మంత్రి దామోదర
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో యంత్ర పరికరాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ కార్యదర్శికి సూచించారు. సోమవారం కోఠీలోని టీజీఎంఎ్‌సఐడీసీ కార్యాలయంలో ఆయన వైద్యారోగ్య శాఖ ఉన్నతాఽఽధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో టీజీఎంఎ్‌సఐడీసీ ప్రధాన కార్యాలయంలో ఐదుగురు బయోమెడికల్ ఇంజనీర్లతో కూడిన ‘కేంద్రీయ పర్యవేక్షణ యూనిట్’ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టీజీఎంఎ్‌సఐడీసీలో పరికరాల విభాగం జనరల్ మేనేజర్‌గా సీనియర్ బయోమెడికల్ ఇంజనీర్‌ను నియమించాలన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సబ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని, అవసరాన్ని బట్టి వాటిలో ఒకరిద్దరు బయోమెడికల్ ఇంజనీర్లను నియమించాలని చెప్పారు. పరికరాల నిర్వహణపై ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందికి ప్రాథమిక శిక్షణ ఇప్పించాలన్నారు. యంత్రం మరమ్మతుకు గురైన గంట లోపే ఆస్పత్రి సూపరింటెండెంట్ సబ్ యూనిట్‌కు, ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. చిన్నపాటి మరమ్మతులైతే ఒక్కరోజులోనే పరిష్కరించేలా కొత్త వ్యవస్థ ఉండాలని మంత్రి ఆదేశించారు.
పెద్ద సమస్యలు ఉంటే మూడు రోజుల్లోగా దాన్ని సరిచేసి, యంత్రాలు పనిచేసేలా చూడాలని స్పష్టం చేశారు. ఒకవేళ విడిభాగాలు అవసరమైతే, సంబంధిత సరఫరాదారుకు సమాచారమిచ్చి మరమ్మతు చేయించాలని చెప్పారు. యంత్ర పరికరాల బాధ్యత ఆస్పత్రి సూపరింటెండెంట్లదేనని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రి స్థాయిని బట్టి, ఏయే యంత్రాలు ఉండాలనేదానిపై ఒక ప్రామాణిక జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, డీఎంఈ నరేంద్ర కుమార్, వీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ సభ్యులుగా కమిటీని నియమించారు. కొత్త టిమ్స్ ఆస్పత్రి, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేయాలని చెప్పారు. వైద్యులు, సిబ్బంది, రోగుల అవసరాలకు అనుగుణంగా ఫర్నిచర్ కొనుగోలు చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల కాలం కావడంతో రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, ఇందుకు అనుగుణంగా మందులు అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి ఆదేశించారు. టీ డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో అన్నిరకాల పరీక్షలు, స్కాన్లు చేయాలని చెప్పారు.
వెల్‌నెస్ కేంద్రాల్లో తనిఖీలు
ఉద్యోగులు, పింఛనుదారులు,జర్నలిస్టులకు వైద్యసేవలందించే వెల్‌నెస్ కేంద్రాలపై మీడియా వార్తల నేపథ్యంలో మంత్రి దామోదర సంబంధిత అఽధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాలతో వెల్‌నెస్ కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెల్‌నెస్ కేంద్రాల్లో వైద్యులు, ఔషధాలు, సిబ్బంది హాజరుపై వివరాలు సేకరించి, నివేదిక రూపొందించారు.
ఇవి కూడా చదవండి
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి