HCA Selection Committee: హెచ్‌సీఏలో నిబంధనలకు విరుద్ధంగా సెలెక్షన్ కమిటీ సభ్యుల నియామకం
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:42 AM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిబంధనలకు విరుద్ధంగా సీనియర్, జూనియర్ సెలెక్షన్ కమిటీ సభ్యుల..
సీఐడీకి ఫుడ్ కమిషన్ చైర్మన్ ఫహీమ్ ఫిర్యాదు
హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిబంధనలకు విరుద్ధంగా సీనియర్, జూనియర్ సెలెక్షన్ కమిటీ సభ్యుల నియామకం జరిగిందని సీఐడీ అదనపు డీజీపీ, విజిలెన్స్ డీజీలకు సోమవారం తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఎ ఫహీమ్ ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. సీనియర్ సెలెక్షన్ కమిటీలో సభ్యులుగా ఉండాలంటే కనీసంగా ఏడు టెస్టు మ్యాచ్‌లు లేదా.. 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా పది అంతర్జాతీయ, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలన్నారు. ఈ కమిటీ సభ్యుడు కావడానికి కనీసం ఐదేళ్ల ముందు రిటైర్ అయి ఉండాలని పేర్కొన్నారు. కమిటీలో ఎన్పీ సింగ్, ఆకాష్ బండారి మినహా మిగిలిన ఎవరికీ అర్హత లేదని, చైర్ పర్సన్‌కు సైతం అర్హత లేదని తెలిపారు. జూనియర్ సెలక్షన్ కమిటీలోనూ సుదీప్ త్యాగి, అరవింద్ శెట్టి మినహా మిగిలిన నియామకాలు నిబంధనలు విరుద్ధంగా జరిగాయని ఫిర్యాదులో ఫహీమ్ పేర్కొన్నారు.