High Court: సిద్దిపేట టూటౌన్ సీఐపై విచారణ చేయండి
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:22 AM
భార్యాభర్తల వివాదంలో నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్‌ను వేధిస్తున్న సిద్దిపేట టూటౌన్ సీఐకి మద్దతు పలికిన ప్రభుత్వ సహాయ న్యాయవాదిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎస్పీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): భార్యాభర్తల వివాదంలో నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్‌ను వేధిస్తున్న సిద్దిపేట టూటౌన్ సీఐకి మద్దతు పలికిన ప్రభుత్వ సహాయ న్యాయవాదిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీసీ టీవీ ఫుటేజ్‌లు సమర్పించాలని ఆదేశిస్తున్నా వినకుండా, సీఐకి అనుకూలంగా వాదనలు వినిపించడంపై అసహనం వ్యక్తం చేసింది. సీఐ వ్యవహారంపై విచారణ చేపట్టాలని, అభియోగాలు నిజమని తేలితే సీఐ సర్వీస్ రికార్డుల్లో ఎంట్రీ చేయాలని సిద్దిపేట ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.
తనకు, తన భార్యకు మధ్య వివాదం విషయంలో సిద్దిపేట టూటౌన్ సీఐ శ్రీనివాస్ రెండు రోజులకోసారి ఫోన్ చేసి కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని వేధిస్తున్నాడని గండ్రాతి సుమన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాదాపు 20 సార్లు పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లినప్పటికీ పోలీసులు వేధిస్తున్నారని.. రూ.కోటి శాశ్వత భరణం చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. దీనిపై జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.