Bhadrachalam: కల్యాణ రాముడికి ఘనంగా మహాపట్టాభిషేకం
ABN , Publish Date - Apr 08 , 2025 | 05:31 AM
దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారికి అత్యంత వైభవంగా మహాపట్టాభిషేకం నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య కల్యాణ సార్వభౌముడికి రాజ లాంఛనాలు సమర్పించారు.

పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల
భద్రాచలం, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారికి అత్యంత వైభవంగా మహాపట్టాభిషేకం నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య కల్యాణ సార్వభౌముడికి రాజ లాంఛనాలు సమర్పించారు. సీతారామచంద్రస్వామిని ఉద యం 10.20 గంటలకు మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. శిల్పకళాశోభితమైన కల్యాణ మండపంపై 10.26 గంటలకు ఆసీనులను చేశారు. అనంతరం పట్టాభిషేక తంతును అర్చకస్వాములు, వేద పండితులు ప్రారంభించారు. ముందుగా శ్రీరాముడి బంగారు పాదుకలను భక్తులకు చూపించి, సమర్పించారు.
ఆ తర్వాత రాజదండం, రాజముద్రిక, రామదాసు చేయించిన పచ్చల పతకం శ్రీరాముడికి, చింతాకు పతకం సీతమ్మకు, శ్రీరామమాడను లక్ష్మణుడికి అలంకరించారు. అనంతరం చామరం, బంగారు ఛత్రం, దుష్ట శిక్షణ కోసం రాజఖడ్గాన్ని రామయ్యకు అందజేసి, సామ్రాట్ కిరీటాన్ని శ్రీరాముడికి ధరింపజేశారు. ఆ తర్వాత దేవేంద్రుడు కానుకగా పంపినట్లు చెప్పే ముత్యాలహారాన్ని తొలుత రామయ్య మెడలో వేయగా అక్కడి నుంచి సీతమ్మకు, తర్వాత రామ భక్త సామ్రాజ్యానికి అధిపతి అయిన హనుమంతుడికి సమర్పించారు. అనంతరం సమస్త నదులు, నాలుగు సముద్రాల నుంచి సేకరించిన జలాలతో రామయ్యకు ప్రోక్షణ నిర్వహించారు. శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని పురస్కరించుకొని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి తుమ్మల స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. దేవస్థానం తరఫున గవర్నర్‌కు జ్ఞాపిక, స్వామి ప్రసాదం, శాలువా బహూకరించారు.
గిరిజన మ్యూజియాన్ని ప్రారంభించిన గవర్నర్
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం భద్రాచలంలో గిరిజన మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు గిరిజన సంప్రదాయ నృత్యంతో స్వాగతం పలికారు. గిరిజన మహిళలు తయారు చేసిన వంటకాలను గవర్నర్ పరిశీలించారు.