Share News

Hyderabad: ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిఫ్టుల నిర్వహణతో దివ్యాంగులకు ఉపాధి

ABN , Publish Date - Jun 23 , 2025 | 03:32 AM

బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో లిఫ్టును ఒక దివ్యాంగుడు నిర్వహించడం చూసి సంతోషించానని.. ఈ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో దివ్యాంగులకు ఉపాధి కల్పించవచ్చేమో ఆలోచించాలని మంత్రి దామోదర రాజనర్సింహకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సూచించారు.

Hyderabad: ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిఫ్టుల నిర్వహణతో దివ్యాంగులకు ఉపాధి

మంత్రి దామోదరకు గవర్నర్‌ సూచన.. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి రజతోత్సవానికి హాజరు

  • క్యాన్సర్‌ బాధితులకు సేవలపై ప్రశంస

  • పేద, ధనిక భేదాలు లేకుండా బాధితులకు సేవలు: బాలకృష్ణ

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో లిఫ్టును ఒక దివ్యాంగుడు నిర్వహించడం చూసి సంతోషించానని.. ఈ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో దివ్యాంగులకు ఉపాధి కల్పించవచ్చేమో ఆలోచించాలని మంత్రి దామోదర రాజనర్సింహకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి, రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ రజతోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, మంత్రి దామోదర రాజనర్సింహా, ఆస్పత్రి చైర్మన్‌ నందమూరి బాలకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలోనే మొదటిసారిగా బసవతారకం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక లీనియర్‌ యాక్సిలేటర్‌ రేడియోథెరపీ యంత్రాన్ని జిష్ణుదేవ్‌వర్మ.. రోగులకు గుండె సంబంధిత పరీక్షలు, చికిత్స అందించడానికి ఏర్పాటు చేసిన ఆధునిక క్యాథ్‌ల్యాబ్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. అందరూ బాగుంటే సమాజం బాగుంటుందని, క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి స్వాంతన చేకూర్చడం ద్వారా బసవతారకం ఆస్పత్రి ముందుకు సాగుతోందని ప్రశంసించారు. ఇలాంటి మంచి సంస్థ 25వ వార్షికోత్సవానికి హాజరవడం తనకు సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. నందమూరి బాలకృష్ణ తనను కలవడానికి వచ్చినపుడు ఒక సినీ హీరో వచ్చారని భావించానని.. కానీ ఆయనను కలిసి మాట్లాడిన తర్వాత బాలకృష్ణ ఒక గ్రేట్‌ హీరో విత్‌ ఏ మిషన్‌ అని తెలిసిందని పేర్కొన్నారు.


రాష్ట్రంలో రీజనల్‌ క్యాన్సర్‌ కేర్‌ సెంటర్లు: రాజనర్సింహ

క్యాన్సర్‌ సమస్య వేగంగా పెరుగుతోందని, తెలంగాణలో ఏటా 50-55 వేల మంది కొత్తగా క్యాన్సర్‌ బారిన పడుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న క్యాన్సర్‌ ఆస్పత్రులు సరిపోవడం లేదని.. ఈ క్రమంలో జిల్లా ఆస్పత్రుల్లో రీజనల్‌ క్యాన్సర్‌ కేర్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకు రాబోతున్నామని తెలిపారు. క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌, డయాగ్నసిస్‌, డే కేర్‌ కీమోథెరపీ, పాలియేటివ్‌ కేర్‌ వంటి సేవలన్నీ వీటిలో అందిస్తామని వెల్లడించారు. పేద రోగులకు సేవలు అందిస్తున్న బసవతారకం వంటి ఆస్పత్రులకు ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు.


ఏపీలో వెయ్యి పడకలతో క్యాన్సర్‌ ఆస్పత్రి: బాలకృష్ణ

110 పడకలతో ప్రారంభమైన బసవతారకం సంస్థ ప్రస్తుతం 700కుపైగా పడకలకు విస్తరించిందని నందమూరి బాలకృష్ణ తెలిపారు. త్వరలోనే ఏపీలో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించనున్నామని చెప్పారు. లాభాపేక్ష లేకుండా, పేద, ధనిక భేదాలు, వివక్ష చూపకుండా క్యాన్సర్‌ బాధితులందరికీ చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. వేదికపై ఉన్న మంత్రి దామోదర రాజనర్సింహను ఉద్దేశిస్తూ.. ఆయన పేరుతో ఓ సినిమా తీయాలని ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ట్రస్టుబోర్డు సభ్యులు శ్రీభరత్‌ మతుకుమల్లి. జేఎ్‌సఆర్‌ ప్రసాద్‌, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..

అర్ధరాత్రి టెంట్‌‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 23 , 2025 | 03:32 AM