Ponguleti Srinivas Reddy: ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చర్యలు
ABN , Publish Date - Apr 23 , 2025 | 05:09 AM
ప్రభుత్వ భూముల ఆక్రమణపై కఠిన చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం. భూ భారతి చట్టంతో పారదర్శకతతో భూసంబంధిత సమస్యలు పరిష్కరించనుంది.

ఫిర్యాదు చేసేందుకు భూ భారతిలో అవకాశం
అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే ఉపేక్షించం
ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించదు
ఎల్‌ఆర్‌ఎస్ గడువు మళ్లీ పెంచం: పొంగులేటి
యాదాద్రి/హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ఇతర సంస్థల భూములను కబ్జా చేస్తే ఎంత పెద్దవారిపైనైనా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రామాల్లో భూదాన్, వక్ఫ్, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం భూ భారతి చట్టంలో ఉందన్నారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. ఆనాటి పెద్దలు భూములను అక్రమంగా లాక్కుంటే చట్టప్రకారం రికవరీ చేస్తామని తెలిపారు. అయితే తమ ప్రభుత్వం కక్షపూరితంగా మాత్రం వ్యవహరించబోదని చెప్పారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ నెలాఖరులోగా ఈ నాలుగు మండలాల్లో అన్ని వివరాలు సేకరించి, జూన్ 2 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తామని తెలిపారు.
అంతకన్నా ముందు.. మే 1వ తేదీ నుంచి మరో 28 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుని భూభారతిని అమలు చేస్తామని ప్రకటించారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములను సాగుచేసుకుంటున్న వారిలో అర్హులు ఉంటే ఇందిరమ్మ పట్టా ఇచ్చేందుకు ఈ చట్టంలో పొందుపరిచామని తెలిపారు. భూ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని చట్టంలో రూపొందించామన్నారు. భూముల రిజిస్ర్టేషన్ల సమయంలో సరిహద్దులతో కూడిన మ్యాప్‌లను ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలి..
ప్రభుత్వ ఆలోచనలు, ప్రాథమ్యాలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకమైన ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి చట్టం అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి రాష్ట్ర సచివాలయం నుంచి భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఎల్‌ఆర్‌ఎస్ తదితర అంశాలపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్న నాలుగు మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలకు గాను 16 గ్రామాల్లో ఈ నెల 17 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సుల్లో ఇప్పటివరకు భూ సమస్యలకు సంబంధించి 5,905 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ నాలుగు పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆదేశించారు.
యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక..
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరపాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ ప్రక్రియను మే మొదటి వారంలోగా పూర్తిచేసి నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని, 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలని అన్నారు. అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలని, అనర్హులను ఎంపిక చేస్తే సదరు గెజిటెడ్ అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణం జరిగితేనే ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు విడుదల చేయాలని సూచించారు. నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారులకు ప్రతి సోమవారం వారి ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలన్నారు. ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, వనపర్తి, మంచిర్యాల, గద్వాల సహా 11 జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఆశించిన స్థాయిలో లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఎల్‌ఆర్‌ఎ్‌సకు గడువు ఈ నెల 30తో ముగుస్తుందని, మరోసారి గడువు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు.