Yadadri Thermal Plant: నెలాఖరుకు యాదాద్రి పవర్ యూనిట్-1 సిద్ధం
ABN , Publish Date - Jul 08 , 2025 | 04:05 AM
యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లోని ఐదు యూనిట్లలో 2026 ఫిబ్రవరికల్లా పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్‌కో నిర్ణయించింది.

హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లోని ఐదు యూనిట్లలో 2026 ఫిబ్రవరికల్లా పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్‌కో నిర్ణయించింది. ప్రస్తుతం 800 మెగావాట్ల యూనిట్-2లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా.. యూనిట్-1 ఈ నెలాఖరుకల్లా పూర్తికానుంది. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పురోగతి, బొగ్గు తరలింపునకు దక్షిణ మధ్య రైల్వే చేస్తున్న పనులపై జెన్‌కో సీఎండీ డాక్టర్ ఎస్.హరీష్ అధికారులతో సోమవారం సమీక్షించారు.
4000 మెగావాట్ల ఐదు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరగాలంటే రోజూ 50 వేల టన్నుల బొగ్గు అవసరం ఉంటుందని, రైల్వే లైనుకు అవసరమైన పనులన్నీ పూర్తిచేయాల్సి ఉంటుందని గుర్తించారు. ఎప్పుడు ఆ పనులు పూర్తవుతాయని జెన్‌కో ఆరా తీయగా.. డిసెంబరుకల్లా పూర్తిచేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.