Share News

Nagarjuna Sagar: నిండుకుండలా సాగర్‌

ABN , Publish Date - Jul 27 , 2025 | 04:37 AM

ఆల్మట్టి నుంచి శ్రీశైలం దాకా అన్ని ప్రాజెక్టులను నిండుగా నింపిన కృష్ణమ్మ, నాగార్జునసాగర్‌కూ పూర్తి జలకళ తెచ్చేసింది. ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుతం 581.30 అడుగులకు నీరు చేరింది.

Nagarjuna Sagar: నిండుకుండలా సాగర్‌

  • ఈ నెల 29న తెరుచుకోనున్న నాగార్జునసాగర్‌ క్రస్ట్‌ గేట్లు

  • జూలైలోనే గేట్లు తెరవడం 18 ఏళ్ల తర్వాత తొలిసారి

  • సామర్థ్యం 590 అడుగులు.. ప్రస్తుతం 581 అడుగులకు

  • ప్రాజెక్టులోకి 1.2 లక్షల క్యూసెక్కుల వరద

  • భద్రాచలం వద్ద 32.5 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవాహం

  • రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు.. కామారెడ్డి జిల్లాలో 6.6 సెం.మీ

  • దెబ్బతిన్న ఇళ్లు.. పాలమూరు జిల్లాలో ఒకరి మృతి

  • రాష్ట్రంలో నేడు కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): ఆల్మట్టి నుంచి శ్రీశైలం దాకా అన్ని ప్రాజెక్టులను నిండుగా నింపిన కృష్ణమ్మ, నాగార్జునసాగర్‌కూ పూర్తి జలకళ తెచ్చేసింది. ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుతం 581.30 అడుగులకు నీరు చేరింది. టీఎంసీల పరంగా చూస్తే.. 312 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 286.76 టీఎంసీల నీరు ఉంది. మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుందని.. 29న సాగర్‌ క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఇన్‌చార్జి ఎన్‌ఈ మల్లికార్జునరావు శనివారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. సాగర్‌ క్రస్ట్‌గేట్లను సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరులో తెరుస్తారు. జూలైలో ఎత్తడం అరుదు. ఈసారి జూన్‌ 30 నుంచే ప్రాజెక్టుకు వరద మొదలైంది. 2007లో జూలైలో ప్రాజెక్టు గేట్లను ఎత్తగా 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ జూలైలో నీటిని దిగువకు వదలనున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 36,033 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, ఎగువ నుంచి 1,20,339 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది. శ్రీశైలంలోకి 1.02 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. 1.52 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మరోవైపు.. ఎగువన మహారాష్ట్రలో వర్షాలు తగ్గడంతో కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి తగ్గింది. అక్కడ 7.6 అడుగుల ఎత్తులో నది ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలోకి 3.41 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది.


వచ్చిన నీటిని వచ్చినట్లుగానే దిగువకు వదిలేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి 32.5 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు పడ్డాయి. కామారెడ్డి జిల్లా గాంఽధారిలో 6.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌ జిల్లా కోటగిరిలో 6.4, కొత్లగూడెం జిల్లా ఇల్లెందులో 6.1, ఖమ్మం జిల్లా సింగరేణిలో 4.6, వికారాబాద్‌ జిల్లా దోమలో 4.5, నారాయణపేట జిల్లా మక్తల్‌లో 4.1, యాదాద్రి జిల్లా మోత్కూరులో 3.8, సిరిసిల్ల జిల్లా గంభీర్‌రావుపేటలో 3.8, ములుగు జిల్లా గోవిందరావుపేటలో 3.6, నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాలలో 3.6, నిర్మల్‌ జిల్లా ముఽథోల్‌లో 3.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా తెలకపల్లి మండలం గౌరారానికి చెందిన జంగయ్య (60) వంగూరు మండలం రామగిరి-రఘుపతిపేట మధ్య దుందుభి నది వంతెన వద్ద నడుచుకుంటూ కాలుజారి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. జగిత్యాల లో 20వ వార్డులో గుండేటి విజయ అనే మహిళకు చెందిన ఇల్లు కూలిపోయింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం మల్యాలలో వరినాట్లకు వెళ్లిన కూలీలు నక్కల ఒర్రెనీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. గ్రామస్థులు తాడు సాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌ శివారులో రాళ్లవాగు చెక్‌డ్యామ్‌ నీటి మట్టాన్ని పరిశీలించడానికి వెళ్లి.. ఏఈఈ నితిన్‌ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. మెదక్‌ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని రుద్రారం, గవ్వపల్లి తండాలో ఇళ్లు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నాగ్లూర్‌ శివారులో కాటేవాడి తండా రైతులు 30 మంది వరినాట్లు వేసేందుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో వాగులో చిక్కుకుపోయారు. ఒకరినొకరు పట్టుకొని గుంపులు గుంపులుగా వాగు దాటారు. కామారెడ్డి జిల్లా సదా శివనగర్‌ మండలం అమర్లబండ వాగులో కొందరు విద్యార్థులు చిక్కుకుపోగా.. వారిని కేజ్‌వీల్‌ ట్రాక్టర్‌లో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.


తేలికపాటి జల్లులు

రాష్ట్రంలో భారీ వర్షాలకు బ్రేక్‌ పడినట్లేనని.. ఆదివారం నుంచి తేలికపాటి వానలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిజిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది.


ఈవార్తలు కూడా చదవండి..

పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..

సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 04:37 AM