Jagitial: బిల్లులు రాక మాజీ సర్పంచ్ ఆత్మహత్య
ABN , Publish Date - Jun 24 , 2025 | 03:48 AM
ఊళ్లో అభివృద్ధి పనుల కోసం అప్పులు చేసి ఖర్చు పెట్టిన నిధులు రాకపోవడం, డబ్బులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు.

గొల్లపల్లి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ఊళ్లో అభివృద్ధి పనుల కోసం అప్పులు చేసి ఖర్చు పెట్టిన నిధులు రాకపోవడం, డబ్బులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బీబీరాజ్‌పల్లి మాజీ సర్పంచ్ దాసరి శంకరయ్య(55) సోమవారం తన మామిడి తోటలో పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు.
శంకరయ్య గత ప్రభుత్వ హయాంలో మంజూరు అయిన రూ.పది లక్షల అభివృద్ధి పనులను ఎన్నికల కోడ్ రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పులు చేసి పూర్తి చేశారు. అయితే, ఆ పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు రాలేదు. దీంతో పాటు కుమారుడు విదేశాలకు వెళ్లడానికి ఆయన రూ.15 లక్షలు అప్పు చేశారు. బాకీలు ఇచ్చిన వారు పైసలు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో శంకరయ్య బలవన్మరణానికి పాల్పడ్డారు.