Share News

పెద్ద ధన్వాడ రైతులకు బేడీలు

ABN , Publish Date - Jun 19 , 2025 | 04:18 AM

ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన కేసులో రిమాండ్‌లో ఉన్న పెద్ద ధన్వాడ రైతులను పోలీసులు బుధవారం బేడీలతో కోర్టుకు తీసుకువచ్చారు.

పెద్ద ధన్వాడ రైతులకు బేడీలు

  • ఇథనాల్‌ కంపెనీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనకు సంబంధించి 40మందిపై కేసులు

  • 12 మందిని జైలు నుంచి అలంపూరు కోర్టుకు తీసుకొస్తుండగా బేడీలు వేసిన పోలీసులు

లంపూరు చౌరస్తా/గద్వాల క్రైం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన కేసులో రిమాండ్‌లో ఉన్న పెద్ద ధన్వాడ రైతులను పోలీసులు బుధవారం బేడీలతో కోర్టుకు తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు ముగ్గురు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామ శివారులో ఇథనాల్‌ కంపెనీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 12 గ్రామాల ప్రజలు అందోళనబాట పట్టిన విషయం తెలిసిందే. కంపెనీ యజమానులు ఈ నెల 3న రాత్రి సిబ్బందిని, యంత్రాలను పెద్దధన్వాడకు తరలించారు. ఇదేమని ప్రశ్నించిన సమీప గ్రామ రైతులపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీనితో ఆగ్రహించిన రైతులు కంపెనీ యంత్రాలు, తాత్కాలిక గుడిసెను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 40 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో 12 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 14 రోజుల రిమాండ్‌ ముగియడంతో వారిని బుధవారం అలంపూర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టుకు మినీ వ్యానులో తీసుకొచ్చారు. ఇద్దరు, ముగ్గురు చొప్పున కలిపి బేడీలు వేసి వారిని కోర్టులోకి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఇలా సంకెళ్లు వేయడం రైతాంగాన్ని అవమానించడమేనని ఇథనాల్‌ వ్యతిరేక పొరాట సమితి అధ్య్యక్షుడు ఎం.జయరామిరెడ్డి మండిపడ్డారు. కాగా కోర్టు ఈ 12 మంది రైతులకు బెయిల్‌ మంజురు చేయడంతో బుధవారం సాయంత్రం విడుదలయ్యారు.


ముగ్గురు పోలీసులపై వేటు..

రైతులకు బేడీలు వేసిన ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. గద్వాల జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించారు. ‘‘జోగుళాంబ గద్వాల జిల్లాలోని రాజోలి పోలీ్‌సస్టేషన్‌కు సంబంధించిన కేసులోని కొందరు వ్యక్తులను పోలీసు అధికారులు మహబూబ్‌నగర్‌ జైలు నుంచి అలంపూర్‌ కోర్టుకు తీసుకువచ్చే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఉన్నతాధికారుల సూచనలు పాటించకుండా, విధుల పట్ల అజాగ్రత్తగా వ్యవహరించిన ఆర్‌ఎస్సై చంద్రకాంత్‌, ఏఆర్‌ఎస్సై ఆంజనేయులు, సురేశ్‌లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాం’’ అని తెలిపారు.


అన్నదాతలకు సంకెళ్లు అమానుషం: కేటీఆర్‌, హరీశ్‌రావు

ఇథనాల్‌ ఫ్యాక్టరీ వద్దంటూ పోరాడుతున్న అన్నదాతలకు సంకెళ్లు వేయడం అమానుషమని, ఇది సీఎం రేవంత్‌రెడ్డి రాక్షసత్వానికి పరాకాష్ఠ అని కేటీఆర్‌ ఆరోపించారు. మొన్న లగచర్లలో ఇప్పుడు పెద్దధన్వాడలో రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇక రేవంత్‌రెడ్డి పాలనలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా, అన్నదాతలపై ఉక్కుపాదం మోపుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు.

Updated Date - Jun 19 , 2025 | 04:18 AM