Kavitha: ప్రాజెక్టు తలమీద ఉన్నా.. కొన్ని మండలాలకు నీళ్లు అందట్లేదు: కవిత
ABN , Publish Date - Nov 11 , 2025 | 09:40 PM
నాగార్జున సాగర్ ప్రాజెక్టు తల మీద ఉన్నా నల్గొండ జిల్లాలోని కొన్ని మండలాలకు ఇప్పటికీ నీరు అందడంలేదని కవిత ఫైర్ అయ్యారు. జిల్లాలోని నక్కలగండి ప్రాజెక్టు సందర్శించి నిర్వాసితులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెల్లికల్ లిఫ్ట్ ప్రాజెక్ట్ ను పూర్తి చేయకపోవడం దారుణమని అన్నారు.
నల్గొండ, నవంబర్ 11: నాగార్జున సాగర్ ప్రాజెక్టు తల మీద ఉన్నా నల్గొండ జిల్లాలోని కొన్ని మండలాలకు ఇప్పటికీ నీరు అందడంలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని నక్కలగండి ప్రాజెక్టు సందర్శించి నిర్వాసితులతో మాట్లాడారు. కేసీఆర్ గత ఉప ఎన్నికల ముందు నెల్లికల్ లిఫ్ట్ పనులు ప్రారంభించినా అప్పటి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఏడాదిలో పూర్తి చేస్తామని లేకుంటే రాజీనామా చేస్తామని వాగ్దానం చేశారని గుర్తుచేశారు. అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నెల్లికల్ లిఫ్ట్ ప్రాజెక్ట్ ను పూర్తి చేయకపోవడం దారుణమని చెప్పారు.
పత్తి రైతులు గత ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్ముకున్నారని.. పత్తి రైతుల కోసం సీసీఐ నిబంధనలు సడలించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో అధికంగా ఉన్న పత్తి రైతుల కష్టాలు జిల్లా మంత్రులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతి పక్ష పార్టీ నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మునిగిపోయారు తప్ప ప్రజల కష్టాలు పట్టడం లేదని దుయ్యబట్టారు.
'ఎన్టీఆర్ హయాంలో రూపకల్పన చేసిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఆధారంగా నక్కల గండి ప్రాజెక్ట్ కట్టాలని నిర్ణయించారు. 2009లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 545 కోట్లతో ప్రాజెక్ట్ ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పటికీ తెలంగాణ ఉద్యమం సాగుతుండటంతో పనులు జరగలేదు. తెలంగాణ వచ్చే వరకు కూడా ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగాయి. తెలంగాణ వచ్చాక 8 కిలోమీటర్ల వరకు టన్నెల్ తవ్వే ప్రయత్నం జరిగింది. కానీ సాంకేతిక కారణాలతో ప్రాజెక్ట్ పనులను ఆపాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సాంకేతిక లోపాలను పట్టించుకోలేదు. దాంతో పెద్ద ప్రమాదం జరిగి 8 మంది చనిపోయారు. ఇప్పటికి నక్కల గండి సహా మరో రెండు తాండాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. మొథ్యా తాండా ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అసలు ఈ ప్రభుత్వం ఎస్ఎల్ బీసీని ఎప్పుడు పూర్తి చేస్తుందో చెప్పాలి' అని కవిత డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
తుఫాను బాధితులకు తక్షణ సాయంగా రూ.12.99 కోట్లు విడుదల
అందెశ్రీని పద్మశ్రీతో గౌరవించడానికి కృషి చేద్దాం: సీఎం రేవంత్‌రెడ్డి