Share News

Mahabubabad: వృద్ధురాలైన తల్లిని రోడ్డు మీద వదిలేసి..

ABN , Publish Date - Jul 11 , 2025 | 06:07 AM

వృద్ధురాలైన తల్లిని నెల రోజుల చొప్పున వంతులవారీగా పోషించేలా మాట్లాడుకున్న ఆ ముగ్గురు కుమారులు.. చివరకు ఆమెను రోడ్డు మీద వదిలేశారు.

Mahabubabad: వృద్ధురాలైన తల్లిని రోడ్డు మీద వదిలేసి..

  • మహబూబాబాద్‌ జిల్లాలో ముగ్గురు కుమారుల దాష్టీకం

గూడూరు (మహబూబాబాద్‌ జిల్లా), జూలై 10 (ఆంధ్రజ్యోతి): వృద్ధురాలైన తల్లిని నెల రోజుల చొప్పున వంతులవారీగా పోషించేలా మాట్లాడుకున్న ఆ ముగ్గురు కుమారులు.. చివరకు ఆమెను రోడ్డు మీద వదిలేశారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూ రు మండలం భూపతిపేటలో ఈ ఘటన వెలుగుచూసింది. వెంగంపేటకు చెందిన బొడ్డు భద్రమ్మ (75)కు ఆరుగురు సంతానంలో వెంకన్న, సుధాకర్‌, రమేశ్‌, యాకస్వామి కుమారులు. ఆరుగురికీ పెళ్లిళ్లు అయ్యాయి. భద్రమ్మ భర్త ముత్తయ్య 20 ఏళ్ల క్రితం మృతిచెందాడు. పెళ్లిళ్లయ్యాక కుమారులకు 30 గుంటల చొప్పున సాగుభూమిని భద్రమ్మ పంచి ఇచ్చింది. పెద్ద కుమారుడు వెంకన్న పదేళ్ల క్రితం మృతిచెందాడు. భద్రమ్మ కూలి పనులకు వెళుతూ బతుకుతోంది.


వయసు మీద పడటంతో తన పనులు తాను చేసుకోలేని స్థితికొచ్చిన తల్లిని.. ముగ్గురు కుమారులు, పెద్ద కోడలు కొన్నాళ్లుగా వంతులవారీగా పోషిస్తున్నారు. అయితే.. పెద్ద కోడలు అనసూర్య వంతు వచ్చేసరికి.. ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ అత్తను పోషించలేనని తేల్చిచెప్పింది. దీంతో తల్లిని యాకస్వామి భూపతిపేట రైతువేదక వద్ద వదిలేసి తన ఊరికి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. గ్రామస్థుల సమక్షంలో ముగ్గురు కుమారులు, వారి భార్యలను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఆపై ముగ్గురు కోడళ్లు సులోచన, ఉపేంద్ర, నాగలక్ష్మి కలిసి ఆటోలో అత్త భద్రమ్మను వెంటబెట్టుకొని పెద్దకోడలు అనసూర్య ఇంటికి తీసుకువెళ్లారు.

Updated Date - Jul 11 , 2025 | 06:07 AM