Share News

Damodara Rajanarasimha: జనం నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి: మంత్రి దామోదర

ABN , Publish Date - Jul 12 , 2025 | 04:48 AM

వైద్యులను జనం దేవుడితో సమానంగా భావిస్తారని, ఆ నమ్మకాన్ని వైద్యులు కచ్చితంగా నిలబెట్టుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు.

Damodara Rajanarasimha: జనం నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి: మంత్రి దామోదర

  • నాగర్‌ కర్నూలులో మెడికల్‌ కళాశాల నూతన భవనం ప్రారంభం

  • 550 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన

నాగర్‌కర్నూల్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): వైద్యులను జనం దేవుడితో సమానంగా భావిస్తారని, ఆ నమ్మకాన్ని వైద్యులు కచ్చితంగా నిలబెట్టుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించిన ఆయన రూ.235 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న 550 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. అత్యాఽధునిక టెక్నాలజీతో వైద్య రంగాన్ని సామాన్య ప్రజలకు చేరువ చేస్తున్నామని, రాష్ట్రంలో ప్రతీ 35 కి.మీ.కు ఓ ట్రామా కేంద్రం, ప్రతీ జిల్లాకు నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలోని నాలుగు ప్రధాన నగరాల్లో క్యాన్సర్‌ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.


వచ్చే ఏడాదిలోగా మెడికల్‌ కళాశాలల్లో నిమ్స్‌, ఉస్మానియా తరహాలో వైద్య సదుపాయాలను అందుబాటులోకి తేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం మెడికల్‌ కళాశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని మెడికోల రవాణా సదుపాయం కోసం రూ.50 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రసంగిస్తూ.. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో రూ.235 కోట్లతో 550 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం చరిత్రాత్మకమన్నారు. నిధులు అవసరమైతే ప్రభుత్వం నుంచే కాకుండా తన చారిటీ ద్వారా మంజూరు చేస్తానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 04:48 AM