Rajanarasimha: రాష్ట్రంలో పెరిగిన డెంగీ కేసులు
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:54 AM
తెలంగాణలో డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ కేసులు నమోదయ్యే జిల్లాల్లో అధికారులు పర్యటించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

ప్లేట్‌లెట్స్ పేరిట దోపిడీ చేస్తే కఠిన చర్యలు: దామోదర
హైదరాబాద్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ కేసులు నమోదయ్యే జిల్లాల్లో అధికారులు పర్యటించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై ప్రతి సోమవారం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. శనివారం ఆరోగ్యశ్రీ కార్యాలయం లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో డెంగీ కేసులు గతఏడాది కంటే పెరుగుతున్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కేసులు పెరిగినట్లు ప్రజారోగ్య విభాగం మంత్రికి నివేదించింది.
డెంగీ, ప్లేట్‌లెట్స్ పేరిట దోపిడికి పాల్పడుతున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులపై తీవ్రమైన చర్యలు ఉంటాయని మంత్రి దామోదర ఈ సందర్భంగా హెచ్చరించారు. డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్‌లో యాంటీ లార్వల్ ఆపరేషన్‌ను విస్తృతం చేయాలన్నారు. వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న జీహెచ్‌ఎంసీ జోన్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై కలెక్టర్లతో రివ్యూ చేయాలని హెల్త్ సెక్రటరీకి మంత్రి సూచించారు. గిరిజన ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారించాలని, ఐటీడీఏ పీవోలతో సమన్వయం చేసుకోవాలన్నారు.