CPI leader: సీపీఐ నేత దొడ్డా నారాయణరావు కన్నుమూత
ABN , Publish Date - Jul 13 , 2025 | 05:16 AM
సీపీఐ సీనియర్ నేత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండల కేంద్రానికి చెందిన దొడ్డా నారాయణరావు(95) శుక్రవారం రాత్రి కన్నుమూశారు.

అంతిమయాత్రలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ
కోదాడ, జూలై 12(ఆంధ్రజ్యోతి): సీపీఐ సీనియర్ నేత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండల కేంద్రానికి చెందిన దొడ్డా నారాయణరావు(95) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. అలుపెరగని ఆయన రాజకీయ జీవితం ఆది నుంచి పోరాటాలు, జైలు జీవితాలతోనే గడిచింది. భారత్-చైనా యుద్ధ సమయంలో నల్లమల అడవుల్లో మూడేళ్ల అజ్ఞాతవాసం, 16నెలలు చంచల్‌గూడ, రాజమండ్రి కారాగారాల్లో ఆయన గడిపారు.
40 ఏళ్లు ప్రజాప్రతినిధిగా..
తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు 1941లో చిలుకూరులో అష్టాంధ్ర మహాసభ నిర్వహించడంలో దొడ్దా నారాయణరావు కీలక భూమిక పోషించారు. చిలుకూరు గ్రామ సర్పంచ్‌గా 24 సంవత్సరాలు, చిలుకూరు ఎంపీపీగా 10 సంవత్సరాలు పనిచేశారు. చిలుకూరులో గ్రంథాలయం ఏర్పాటు చేయడంలో తనదైన పాత్ర పోషించారు. 96 ఏళ్ల వయస్సులో కూడా కాలినడకన వెళ్లేవారు. ఆయనకు చిలుకూరు గాంధీగా పేరుంది. గత ఏడాది ఆగస్టు 20న ఆయన సతీమణి సక్కుబాయి(85) కన్నుమూశారు. నారాయణరావుకు ముగ్గురు కుమారులున్నారు. నారాయణరావు అంతియ యాత్రలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, ఎమ్మెల్యే పద్మావతి, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు ఘనంగా నివాళులర్పించారు.