Share News

CPI K Narayana: నీళ్ల మాటున రాజకీయం తగదు

ABN , Publish Date - Jul 19 , 2025 | 05:20 AM

నీళ్ల మాటున రాజకీయం తగదని, అలా చేస్తే తల్లిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసినట్టేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

CPI K Narayana: నీళ్ల మాటున రాజకీయం తగదు

  • బీఆర్‌ఎస్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు

  • తెలంగాణ ప్రయోజనాల కోసమే రేవంత్‌ రెడ్డి పని చేస్తున్నారు

  • సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

న్యూఢిల్లీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): నీళ్ల మాటున రాజకీయం తగదని, అలా చేస్తే తల్లిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసినట్టేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జల వివాదాల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని అందరూ స్వాగతించాల్సిన అంశమని తెలిపారు. పంచాయితీలు అవసరంలేదని, ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేయడం మంచి విషయమని, అయితే కమిటీ నాన్చుడు ధోరణి అవలంబించకుండా త్వరగా పని పూర్తి చేయాలన్నారు.


రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చుని మాట్లాడుకుంటే.. నీటిని సమృద్ధిగా వినియోగించుకోవచ్చని, రెండు రాష్ట్రాలను సస్యశ్యామలం చేయొచ్చని పేర్కొన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ పోవడానికి కారణమే కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ క్యాబినెట్‌లో తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లు 12 మంది ఉన్నట్టు గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రస్తుతం బనకచర్ల ప్రాధాన్యంకాదని, ముందు పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయాలన్నారు. రేవంత్‌రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అని, ఆయనను అనవసరంగా నిందించడం సరికాదన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే రేవంత్‌ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.

Updated Date - Jul 19 , 2025 | 05:20 AM