ACB Investigation: లారీ సీజ్ చేయొద్దంటే.. రూ.20 వేల లంచం
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:07 AM
భద్రాచలం సీఐ బరపాటి రమేశ్ రూ.20 వేలు లంచం తీసుకుని అనధికారికంగా గ్రావెల్ తరలిస్తున లారీని విడిపించాడని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సీఐ గన్‌మెన్ రామారావు, ప్రైవేట్ వ్యక్తి కార్తీక్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు

ఏసీబీకి చిక్కిన భద్రాచలం సీఐ రమేష్
సీఐ గన్‌మెన్, మధ్యవర్తి కూడా అరెస్ట్
భద్రాచలం. ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): అనధికారికంగా గ్రావెల్ తరలిస్తూ పట్టుబడిన లారీని విడిపించడానికి రూ.20 వేలు లంచం తీసుకున్న భద్రాచలం సీఐ బరపాటి రమే్‌షను గురువారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐ గన్‌మెన్ రామారావు, మరో ప్రైవేట్ వ్యక్తిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం గత నెల 19న భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద పోలీసుల తనిఖీలో బూర్గంపాడ్ మండలం లక్ష్మీపురం నుంచి భద్రాచలానికి అనధికారికంగా గ్రావెల్ తరలిస్తున్న లారీ పట్టుబడింది. సదరు లారీ యజమానిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఇంటి నిర్మాణానికి గ్రావెల్ తరలిస్తున్నా ముందు అనుమతి తీసుకోనందుకు కేసు పెడతామని సీఐ బరపాటి రమేశ్ తెలిపారు. ఈ క్రమంలో సీఐ గన్‌మెన్ రామారావు రూ.30 వేలు చెల్లిస్తే లారీని వదిలేస్తారని మధ్యవర్తిత్వం వహించాడు. అంత సొమ్ము ఇవ్వలేనని కేసు పెట్టుకోండంటూ లారీ యజమాని చెప్పేశాడు. సీఐతో మాట్లాడి రూ.20 వేలు చెల్లించేందుకు లారీ ఓనర్‌ని ఒప్పించిన గన్‌మెన్ రామారావు.. కార్తీక్ అనే ప్రైవేట్ వ్యక్తికి ఫోన్‌పే చేయించి లారీని విడుదల చేశారు.
దీనిపై లారీ యజమాని ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు గురువారం భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. సీఐ రమేష్, రామారావు, కార్తీక్‌లనూ అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ బాధితుడి నుంచి రూ.20 వేల నగదు ఫోన్‌పే ద్వారా సీఐ పొందినట్లు ఆధారాలున్నాయన్నారు. సీఐ చెబితేనే తాను కార్తీక్‌కు రూ.20 వేలు ఫోన్‌పే చేయించానని రామారావు అంగీకరించాడని చెప్పారు.