Share News

Uttam: చిత్తశుద్ధి చాటుకున్నాం..

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:36 AM

కాంగ్రెస్‌ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి చిత్తశుద్ధిని చాటుకున్నామని మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్‌, నీటి పారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

Uttam: చిత్తశుద్ధి చాటుకున్నాం..

  • వర్గీకరణ చేసి మాట నిలుపుకొన్నాం

  • దశాబ్దాల డిమాండ్‌ను నెరవేర్చాం

  • వచ్చే జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం

  • మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి చిత్తశుద్ధిని చాటుకున్నామని మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్‌, నీటి పారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణను కచ్చితంగా అమల్లోకి తెస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఎస్సీ ఉపకులాల దశాబ్దాల డిమాండ్‌ అయిన ఎస్సీ వర్గీకరణను తమ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు. ఆదివారం రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ అమలుపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ భేటీలో ఉప సంఘం చైర్మన్‌ ఉత్తమ్‌, వైస్‌ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, వర్గీకరణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌, అధికారులు శ్రీధర్‌, తిరుపతి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. కమిషన్‌ వేసి ఎస్సీ ఉప కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై లోతుగా అధ్యయనం చేశామని, 8,600 పైగా వినతులు స్వీకరించామని తెలిపారు. ఎస్సీ కులాల జనాభా, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి, విద్యా అవకాశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించామన్నారు. కమిషన్‌ సిఫార్సులపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి ఆమోద ముద్ర వేసిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌ నానుతూ వచ్చిందని చెప్పారు. తాను 1999 నుంచి ప్రతి శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించడాన్ని ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ఇన్నేళ్లకు తమ ప్రభుత్వం డిమాండ్‌ నెరవేర్చిందని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్సీ జనాభా 17.5 శాతానికి చేరిందని.. 2026లో జరగబోయే జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని ఎస్సీలకు ప్రస్తుమున్న 15 శాతం రిజర్వేషన్లను మరింత పెంచే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఉత్తమ్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందుల అభివృద్ధి పేరుతో జగన్ మోసం

ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్..

టీడీపీ కార్యకర్తపై కేసు.. మరికాసేపట్లో అరెస్టు..

For More AP News and Telugu News

Updated Date - Apr 14 , 2025 | 03:36 AM