Share News

Ashwini Vaishnaw: సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలపండి

ABN , Publish Date - Jul 18 , 2025 | 04:15 AM

తెలంగాణలో సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Ashwini Vaishnaw: సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలపండి

  • ఎలకా్ట్రనిక్స్‌ పార్కులను ఏర్పాటు చేయండి

  • కొత్త రైలు మార్గాలను మంజూరు చేయండి

  • రీజినల్‌ రింగ్‌ రైల్‌కు త్వరగా అనుమతివ్వండి

  • కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయండి

  • కేంద్ర మంత్రి వైష్ణవ్‌కు సీఎం రేవంత్‌ వినతులు

న్యూఢిల్లీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని రైల్‌ భవన్‌లో మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలతో కలిసి గురువారం ఆయన అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ‘‘ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఉంది. ప్రపంచ స్థాయి పరిశోధనలు, అభివృద్ధి కేంద్రాలు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజ్‌ టెక్నాలజీస్‌ (ఏఎ్‌సఐపీ) ప్రాజెక్టు, మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఫ్యాబ్‌ ప్రాజెక్టు, క్రిస్టల్‌ మ్యాట్రిక్స్‌కు ఆమోదం తెలపండి’’ అని కోరారు. అలాగే, ఈఎమ్‌సీ 2.0 పథకం కింద రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్‌ ఎలకా్ట్రనిక్స్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ వినతిని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రీజనల్‌ రింగు రోడ్డు సమీపంలో నూతన ఎలకా్ట్రనిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.


రీజనల్‌ రింగ్‌ రైల్‌కు అనుమతించండి

తెలంగాణలో రైలు మార్గాల అనుసంధానాన్ని మరింత పెంచేందుకు నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని రైల్వే శాఖ మంత్రి కూడా అయిన అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ రీజనల్‌ రింగు రోడ్డుకు సమాంతరంగా రీజనల్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించామని, రైల్వే బోర్డు ఇప్పటికే తుది లొకేషన్‌ సర్వేకు అనుమతి ఇచ్చిందని, రూ.8,000 కోట్ల ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానం పెరగడంతోపాటు నగరంలోని ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందని వివరించారు. గ్రామీణ పేదరికం తగ్గడంతోపాటు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. హైదరాబాద్‌ డ్రై పోర్టు నుంచి బందరు ఓడ రేవుకు అనుసంధానంగా రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు. ఔషధాలు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులకు ఈ మార్గం దోహదపడుతుందని చెప్పారు. తెలంగాణలో రైల్వే ఆపరేషన్లను మరింత సమర్థంగా నిర్వహించేందుకు కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో, ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందుతాయన్నారు. అలాగే, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించడంతోపాటు పారిశ్రామిక, వ్యవసాయ ఎగుమతులు, దిగుమతుల కోసం, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నూతన రైలు మార్గాలు మంజూరు చేయాలని కోరారు. ఇందులో వికారాబాద్‌ - కృష్ణా (122 కి.మీ., అంచనా వ్యయం రూ.2,677 కోట్లు); కల్వకుర్తి - మాచర్ల (100 కి.మీ., అంచనా వ్యయం రూ.2 వేల కోట్లు); డోర్నకల్‌ - గద్వాల (296 కి.మీ., అంచనా వ్యయం రూ.6,512 కోట్లు); డోర్నకల్‌ - మిర్యాలగూడ (97 కి.మీ., అంచనా వ్యయం రూ.2,184 కోట్లు) మార్గాలను వంద శాతం రైల్వే వ్యయంతో మంజూరు చేయాలని కోరారు.


ఇవి కూడా చదవండి

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

స్వచ్ఛ సర్వేక్షణ్‎ 2024-25లో ఏపీకి 5 పురస్కారాలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 04:15 AM