Ashwini Vaishnaw: యాదగిరిగుట్ట రైల్వే ప్రాజెక్టుకు రూ.100 కోట్లు
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:59 AM
ఘట్‌కేసర్- యాదగిరి గుట్ట ఎంఎంటీఎస్ రైలు ప్రాజెక్టు పనుల నిమిత్తం రూ.100 కోట్లు కేటాయించినట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎంపీ చామల కృతజ్ఞతలు
న్యూఢిల్లీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఘట్‌కేసర్- యాదగిరి గుట్ట ఎంఎంటీఎస్ రైలు ప్రాజెక్టు పనుల నిమిత్తం రూ.100 కోట్లు కేటాయించినట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ మేరకు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డికి బుధవారం లేఖ ద్వారా తెలిపారు. సుమారు 33 కి.మీ మేర ఉన్న మూడో లైన్ మార్గం కోసం కేటాయించిన రూ.412 కోట్లు విడుదల చేయాలని గత పార్లమెంట్ సమావేశాల్లో జీరో అవర్‌లో ఎంపీ చామల కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ నేపథ్యంలో చామలకు కేంద్ర మంత్రి లేఖ రాశారు. ‘ఏప్రిల్ 3న జీరో అవర్ సందర్భంగా ఘట్‌కేసర్- యాదగిరి గుట్ట రైలు మార్గం కోసం రూ.412 కోట్లు విడుదల చేయాలని మీరు కోరారు. 2016లో ఎంఎంటీఎస్ కింద ఖర్చు భాగస్వామ్య ప్రాతిపదికకు ఆమోదం లభించింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు డిపాజిట్ చేయకపోవడంతో ప్రాజెక్టు ప్రారంభించలేకపోయాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పూర్తిగా రైల్వే శాఖ నిధులతో చేపడుతున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం’ అని కేంద్రమంత్రి లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్, కేంద్ర రైల్వే సహాయ మంత్రి రవనీత్ సింగ్‌కు ఎంపీ చామల కృతజ్ఞతలు తెలిపారు.