BJP: బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:20 AM
కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

బీజేపీ అడ్డుకొంటోందనడం అబద్ధం: కృష్ణయ్య
హైదరాబాద్/కవాడిగూడ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు శనివారం ధర్నాచౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు 42ు రిజర్వేషన్‌ను కేంద్రం అడ్డుకుంటోందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు బీసీ కాదంటూ కాంగ్రెస్ చేసిన విమర్శలపై కృష్ణయ్య మండిపడ్డారు. ‘‘యూనివర్శిటీలో ఆయన చేసిన పోరాటాల గురించి వాళ్లకేం తెలుసు. నేను స్వయంగా చూశాను.
ఆయన టైగర్. రాంచందర్‌రావు మాటలు, చూపులే చల్లగ ఉంటాయి. పనులు మాత్రం ఖతర్నాక్’’ అని కృష్ణయ్య అన్నారు. ఇదిలా ఉండగా, ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో ‘ఫీజుల పోరు’ పేరుతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రూ.6వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ట్రస్ట్ బ్యాంకు ద్వారా ఫీజులు చెల్లిస్తామంటూ కొత్తనాటకానికి తెరలేపారని కృష్ణయ్య మండిపడ్డారు.