Raja Singh: రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం
ABN , Publish Date - Jul 12 , 2025 | 04:55 AM
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బీజేపీ షాక్ ఇచ్చింది. అనూహ్యంగా పది రోజుల వ్యవధిలోనే ఆయన రాజీనామాను పార్టీ జాతీయ నాయకత్వం ఆమోదించింది.

పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరించనందువల్లేనని వెల్లడి
ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేసేలా త్వరలో స్పీకర్‌కు లేఖ?
చివరి శ్వాస దాకా హిందుత్వం కోసం పనిచేస్తా.. రాజాసింగ్ స్పష్టీకరణ
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్, జూలై 11(ఆంధ్రజ్యోతి): గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బీజేపీ షాక్ ఇచ్చింది. అనూహ్యంగా పది రోజుల వ్యవధిలోనే ఆయన రాజీనామాను పార్టీ జాతీయ నాయకత్వం ఆమోదించింది. గత నెల 30న ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అదే రోజు ఆయన రాజీనామా లేఖను జాతీయ నాయకత్వానికి నివేదించారు. ‘‘రాజీనామా లేఖలో మీరు ప్రస్తావించిన అంశాలు అసంబద్ధంగా ఉన్నాయి. పార్టీ సిద్ధాంతానికి, ప్రాథమిక సూత్రాలకు పొంతన లేకుండా ఉన్నాయి. మీ రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఆమోదిస్తున్నాం’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్.. రాజాసింగ్‌కు లేఖ రాశారు. కాగా, పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక సందర్భంగా రాజాసింగ్ చేసిన విమర్శలను బీజేపీ జాతీయ నాయకత్వం సీరియ్‌సగా తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్.రాంచందర్‌రావు ఎన్నికపై బహిరంగ విమర్శలు చేశారు. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌లు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్‌తో పాటు కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక రిటర్నింగ్ అధికారి శోభ కూడా రాజాసింగ్ వైఖరిని తప్పుబడుతూ జాతీయ నాయకత్వానికి అదే రోజు నివేదించారు. అప్పటికే ఒకమారు సస్పెన్షన్‌కు గురై, ఏడాది అనంతరం, తిరిగి పార్టీలోకి వచ్చిన రాజాసింగ్, ఆ తర్వాత కూడా పలుమార్లు రాష్ట్ర పార్టీ ముఖ్యులపై బహిరంగ విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి, నాటి రాష్ట్రపార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపైనా ఆరోపణలు చేశారు. చివరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం వేదికగా గుప్పించిన విమర్శలు, పార్టీ జాతీయ నాయకత్వం ఆయనకు షాక్ ఇచ్చేలా చేశాయి. ఆవేశంలో ఆయన రాజీనామా చేసినా.. ఆ తర్వాత పార్టీలోకి తిరిగి వచ్చేందుకు రాజాసింగ్ ప్రయత్నాలు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, జాతీయ నాయకత్వం సీరియ్‌సగా ఉందన్న విషయం గ్రహించి, ఒకరిద్దరు ముఖ్యనేతలు సైతం ఆయనకు అండగా నిలిచేందుకు వెనుకడుగు వేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎమ్మెల్యేగా అనర్హత వేటు..?
రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ జాతీయ నాయకత్వం, ఎమ్మెల్యేగా ఆయన అనర్హత విషయంలో కూడా అదే వైఖరి కొనసాగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీకి రాజీనామా చేసినందున ఎమ్మెల్యేగా తనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాయాలని రాజాసింగ్ గత నెల 30న ఇచ్చిన రాజీనామా లేఖలో కిషన్‌రెడ్డిని కోరారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత, ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగడం భావ్యం కాదని రాజాసింగ్ స్వయంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ త్వరలోనే స్పీకర్‌కు లేఖ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు.
హిందుత్వం కోసమే పనిచేస్తా: రాజాసింగ్
తన చివరిశ్వాస వరకూ హిందూ సమాజ హక్కుల కోసం గొంతు వినిపిస్తూనే ఉంటానని రాజాసింగ్ తెలిపారు. ‘‘ప్రజలకు, దేశానికి సేవ చేయడం, హిందూత్వాన్ని రక్షించడం అనే లక్ష్యంతో 11 ఏళ్ల క్రితం నేను బీజేపీలో చేరాను. పార్టీ నన్ను నమ్మి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. నేను ఈ నిర్ణయం ఏ పదవి, అధికారం లేదా వ్యక్తిగత ఆసక్తి కారణంగా తీసుకోలేదు. నేను హిందుత్వకు సేవ చేయడానికి పుట్టాను. నా చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పనిచేస్తూనే ఉంటాను.’’ అని రాజాసింగ్ ఒక ప్రకటనలో వివరించారు. ప్రస్తుతం ఆయన అమర్‌నాథ్ యాత్రలో ఉన్నారు.
కార్పొరేటర్‌గా టీడీపీ నుంచి ప్రస్థానం..
రాజాసింగ్ 2009లో టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. టీడీపీ, బీజేపీ పొత్తుతో టీడీపీ అభ్యర్థిగా మంగళహాట్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2014లో బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థిగా గోషామహల్ నుంచి 2014, 2018, 2023లో గెలిచారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. ఓ వర్గం వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో 2022 ఆగస్టు 23న రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ వేటును 22 అక్టోబరు 2023లో ఎత్తివేసి గోషామహల్ టికెట్ ఇచ్చింది. రాజాసింగ్ ఏకంగా కేంద్ర మంత్రి, అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. కిషన్‌రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నంత వరకు తాను పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టనని భీష్మించారు. పార్టీలో తనది ప్రత్యేక అజెండాగా రాజాసింగ్ వ్యవహరించే వారు. రాష్ట్ర అధ్యక్ష, శాసన సభ పక్ష నేత పదవులను ఆయన ఆశించారు. పార్టీలో పాత సామానును బయటికి పంపించాలని, కొందరికి రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపాలని ఇటీవల అన్నారు. రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి, ఆయనకూ దూరం పెరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!
అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు
For Telangana News And Telugu News