Share News

Bhatti Vikramarka: యూరియా బాధ్యత ప్రభుత్వానిదే

ABN , Publish Date - Jul 28 , 2025 | 03:36 AM

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం చారిత్రాత్మకమైందన్నారు.

Bhatti Vikramarka: యూరియా బాధ్యత ప్రభుత్వానిదే

  • రైతులు ఆందోళన చెందవద్దు: భట్టి

  • అభివృద్ధికి మోడల్‌గా ఉమ్మడి ఖమ్మం జిల్లాను తీర్చిదిద్దాలి: మంత్రి తుమ్మల

  • ఆగస్టు 15 లోగా ఇందిరమ్మ డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీ: మంత్రి పొంగులేటి

కొత్తగూడెం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం చారిత్రాత్మకమైందన్నారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమలవుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల పురోగతిపై డిప్యూటీ సీఎంతోపాటు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెండు జిల్లాల కలెక్టర్‌లు దురిశెట్టి అనుదీప్‌, జితేష్‌ పాటిల్‌ సమీక్షించారు. 2 జిల్లాలో వర్షాభావం, గోదావరికి వరదలు వస్తే తీసుకోవాల్సిన చర్యలతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. కలెక్టర్లు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. చారిత్రాత్మక ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకంలో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. రైతులకు సరిపడా యూరియా, ఎరువులు సరఫరా చేసే బాధ్యత సర్కారుదేనని రైతులు ఆందోళన చెందొద్దన్నారు.


ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా తక్కువ ఉన్నదని జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అభివృద్ధికి మోడల్‌గా ఉమ్మడి ఖమ్మం జిల్లాను తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో పలు ప్రాంతాలు వర్షాలు, వరదల వల్ల.. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రవాహంతో ముంపునకు గురవుతుందన్న తుమ్మల.. ఇటువంటప్పుడు అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఆస్తి, ప్రాణ నష్టం జరక్కుండా అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 15 నాటికి ఇందిరమ్మ డబుల్‌ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని, ఆగస్టులో శ్రావణ మాసం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూశాఖలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం

కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 28 , 2025 | 03:36 AM