Bhatti Vikramarka: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
ABN , Publish Date - Jul 14 , 2025 | 05:19 AM
రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మంచిర్యాల, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క తెలిపారు. గడిచిన పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో డ్వాక్రా సంఘాలను పూర్తిగా గాలికి వదిలేశారని, మహిళా సంఘాలను మహాలక్ష్మిగా భావించి కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తోందని అన్నారు. మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆయన ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు.
దండేపల్లి మండలం రెబ్బనపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి మాట్లాడారు. రూ. 21,630 కోట్లతో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నామని, ప్రతి నెలా 12 నుంచి 25 తేదీ వరకు క్రమం తప్పకుండా మహిళా సంఘాలకు చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మూల కారణమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభించి రైతులకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.