BC Associations: మల్లన్నపై దాడిని ఖండిస్తున్నాం: బీసీ సంఘాలు
ABN , Publish Date - Jul 14 , 2025 | 03:39 AM
మ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు ఆయన కార్యాలయంపై జరిగిన దాడిని పలు బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడికి పాల్పడిన జాగృతి కార్యకర్తలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.

తార్నాక/రాంనగర్/జహీరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు ఆయన కార్యాలయంపై జరిగిన దాడిని పలు బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడికి పాల్పడిన జాగృతి కార్యకర్తలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. దాడిలో గాయపడ్డ మల్లన్నను బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్, కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్‌రాజ్ గౌడ్, సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్ పరామర్శించారు. అనంతరం చిక్కడపల్లిలోని కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. బీసీ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న మల్లన్నపైౖ దాడులు హేయమని మండిపడ్డారు. బీసీలపై ఇప్పుడు ప్రేమ కురిపిస్తున్న కవిత.. ఆనాడు బీఆర్‌ఎస్ పాలనలో ఏం చేశారని నిలదీశారు. మల్లన్నపై దాడి కేసులో ఏ1గా కల్వకుంట్ల కవితపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్‌గౌడ్, బీసీ నేత వట్టే జానయ్య యాదవ్, పొలిటికల్ జేఏసీ కో చైర్మన్ హరిశంకర్‌గౌడ్ పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్నపై దాడిని యావత్ తెలంగాణ బీసీ సమాజంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని ఓయూ జేఏసీ అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదని, భవిష్యత్తులో ఇలాగే దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్నతో పాటు ఆయన కార్యాలయంపై దాడిని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ టీం సభ్యులు జ్యోతి పండాల్, నర్సింహ, రంగమ్మ, నగేశ్ తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
వికసిత్ తెలంగాణ బీజేపీకే సాధ్యం
Read Latest Telangana News And Telugu News