Bandi Sanjay: ఫూలే ఆశయాలకు విరుద్ధంగా పాలన
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:31 AM
మహాత్మ జ్యోతిరావు ఫూలే ఆశయాలకు విరుద్ధంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.

గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ నట్టేట ముంచింది
బడుగు వర్గాలకు కొండంత ధైర్యం ఫూలే: సంజయ్
బీసీలపై కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సది మొసలి కన్నీరు: లక్ష్మణ్
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): మహాత్మ జ్యోతిరావు ఫూలే ఆశయాలకు విరుద్ధంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మహాత్ములకు నివాళులర్పించడమంటే వారి జయంతి, వర్ధంతిలను నిర్వహించడం మాత్రమే కాదని, వారి ఆశయాలను నెరవేర్చడమని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ అణిచివేతపై తిరుగుబాటుకు కేరాఫ్ అడ్రస్, బడుగు, బలహీన వర్గాలకు కొండంత ధైర్యం జ్యోతిరావు ఫూలే అని కొనియాడారు.
చదువుతోనే సమాజాభివృద్ధి సాధ్యమని నమ్మి, అందుకోసం చివరిదాకా కృషి చేసిన మహనీయుడని ప్రశంసించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పుణ్యమా అని.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అప్పుల్లో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నట్టేట ముంచిందని దుయ్యబట్టారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ఓటుబ్యాంకు రాజకీయాల్లో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టిందని విమర్శించారు. గతంలో బీసీల వాటాను 51 నుంచి 46 శాతానికి తగ్గించిన కాంగ్రెస్.. ఇప్పుడు ముస్లింలను ఓబీసీల్లో చేర్చే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి:
అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..
షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..
దారుణం.. తండ్రి శవ పేటిక కింద ఇరుక్కుపోయిన తనయుడు