Share News

Bandi Sanjay: కాంగ్రెస్‌ హయాంలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతుందేమో!

ABN , Publish Date - Jul 19 , 2025 | 05:09 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ హయాంలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

Bandi Sanjay: కాంగ్రెస్‌ హయాంలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతుందేమో!

  • ట్యాపింగ్‌ సిస్టమ్‌ను ఎత్తుకొచ్చి పెట్టుకుందేమో

  • కేసీఆర్‌ కుటుంబాన్ని అరెస్ట్‌ చేసే ధైర్యముందా?

  • బీసీలకు రేవంత్‌ ఇచ్చేది 32% రిజర్వేషనే: బండి సంజయ్‌

జనగామ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ హయాంలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ సిస్టమ్‌ను నిజంగానే ధ్వంసం చేశారా? లేక కాంగ్రెస్‌ వాళ్లే ఎత్తుకొచ్చి పెట్టుకున్నారా? అని సందేహం వ్యక్తం చేశారు. జనగామలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన ‘జిల్లా సంస్థాగత సంఘటన కార్యశాల’లో బండి సంజయ్‌ పాల్గొన్నారు. అంతకుముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. భార్యాభర్తల ఫోన్లు, జడ్జిల ఫోన్లు, ఆఖరికి రాజకీయ నేతల ఇళ్లలోని పనివాళ్ల ఫోన్లను ట్యాప్‌ చేయించిన ఘనత కేసీఆర్‌దేనని విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ను కిషన్‌రెడ్డి కాపాడుతున్నారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. కిషన్‌రెడ్డి ఫోన్‌ కూడా ట్యాపింగ్‌ చేశారని, అలాంటప్పుడు ఆయన ఎందుకు కాపాడతారని నిలదీశారు.


విచారణ పేరుతో కాలయాపన చేయడం తప్ప.. కేసీఆర్‌ కుటుంబాన్ని అరెస్ట్‌ చేసే ధైర్యం రేవంత్‌రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏర్పడినప్పుడు పెద్దన్నలా వ్యవహరించి పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, ఒకటి, రెండు రోజుల్లో పరిష్కారమయ్యే సమస్య కాకపోవడంతో కమిటీ వేయాలని నిర్ణయించిందని తెలిపారు. బనకచర్ల విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సొంత ఎజెండాతో వచ్చారని, ఇక్కడ రేవంత్‌, అక్కడ చంద్రబాబు అబద్ధాలే చెప్పారని తెలిపారు. కానీ, సమావేశంలో జరిగిందేంటో.. కేంద్రం చెప్పిందన్నారు. అభివృద్ధే మంత్రంగా తాము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నామని, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మాత్రం హౌలే, బే, డ్రగ్స్‌, హీరోయిన్స్‌ అనే నినాదాలతో ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నాయని విమర్శించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచడాన్ని తాము వ్యతిరేకించట్లేదని చెప్పారు. 42లో 10ు ముస్లింలకు ఇస్తామంటున్నారని, ఈ లెక్కన బీసీలకు ఇచ్చేది 32 శాతమే అవుతుందన్నారు. బీసీలకు పూర్తిగా 42% రిజర్వేషన్‌ ఇస్తామంటే.. అందరం కలిసి ప్రధానిని ఒప్పిద్దామన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 05:09 AM