Share News

Bandi Sanjay: ముస్లిం రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ కుట్ర

ABN , Publish Date - Apr 22 , 2025 | 04:10 AM

రిజర్వేషన్లను వ్యతిరేకించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఓట్ల కోసం ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్ర చేసిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Bandi Sanjay: ముస్లిం రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ కుట్ర

  • రిజర్వేషన్లను వ్యతిరేకించిన చరిత్ర ఆ పార్టీది

  • రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి దుర్భరం: బండి సంజయ్‌

కరీంనగర్‌/వేములవాడ, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రిజర్వేషన్లను వ్యతిరేకించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఓట్ల కోసం ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్ర చేసిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. మైనారిటీల మెప్పు కోసం మైనారిటీ విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను నిషేధించిందన్నారు. సోమవారం కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో సంజయ్‌ మాట్లాడారు. అంబేడ్కర్‌ రిజర్వేషన్లను ప్రతిపాదిస్తే నెహ్రూ వ్యతిరేకించారని గుర్తు చేశారు. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే మండల కమిషన్‌ సిఫారసులను ఆమోదించకుండా కాంగ్రెస్‌ ఆ వర్గాలను అవమానించిందని మండిపడ్డారు. ఓబీసీ రిజర్వేషన్లను ప్రతిపాదించిన కాకా కలేల్కర్‌ కమిషన్‌ సిఫారసులను కాంగ్రెస్‌ తిరస్కరించిందని పేర్కొన్నారు.


బీజేపీ పాలనలో అంబేడ్కర్‌కు భారత రత్న ఇచ్చామని తెలిపారు. అంబేడ్కర్‌ జయంతిని రాష్ట్రీయ సమర్‌సతా దినంగా ప్రకటించి 120 దేశాల్లో జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో జర్నలిస్టులు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని బండి సంజయ్‌ అన్నారు. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ప్రెస్‌క్లబ్‌లో సంజయ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని, జర్నలిస్టులు సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - Apr 22 , 2025 | 04:10 AM