Share News

Minister Seethakka: కందిపప్పు కాంట్రాక్టులు రద్దు

ABN , Publish Date - Apr 11 , 2025 | 04:02 AM

ప్రభుత్వం, నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన కందిపప్పు కాంట్రాక్టులను రద్దు చేసింది.మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కాంట్రాక్ట్ ల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు

Minister Seethakka: కందిపప్పు కాంట్రాక్టులు రద్దు

  • టెండర్లు పిలవకుండా కట్టబెట్టడంపై

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో సర్కారు చర్యలు

  • అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా కోసం నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చిన అధికారులు

  • ఈ వ్యవహారంపై మంత్రి సీతక్క ఆగ్రహం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన ‘కందిపప్పు కాంట్రాక్టుల’ను ప్రభుత్వం రద్దు చేసింది. అంగన్‌వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరాకు జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని కొనుగోలు కమిటీ ద్వారా మాత్రమే టెండర్లు పిలిచి కాంట్రాక్టులు ఖరారు చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయినా కూడా టెండర్లు పిలవకుండా, నిబంధనలకు విరుద్ధంగా 15 జిల్లాల్లో కాంట్రాక్టులు కట్టబెట్టారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాలపై ఆ శాఖ అధికారులు స్పందించి... ఆ కాంట్రాక్టులను రద్దు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు కట్టడంపై గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులపై ఆగ్రహం చేశారు. సొంత నిర్ణయాలు ఎవరు తీసుకోమన్నారని ప్రశ్నించారు. అంగన్‌వాడీ కేంద్రాలు వంద శాతం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో 313 కేంద్రాలు మూతపడ్డాయని, చిన్నారులు లేరనే సాకుతో మూసివేయడం సరికాదన్నారు. చిన్నారులు లేని కేంద్రాలను డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని కేంద్రాలు పిల్లలతో కళకళలాడాలని సూచించారు. ప్రతి కేంద్రంలో కనీసం 20 మంది ఉండాలని, బడిబాట తరహాలో గ్రామాల్లో చిన్నారులను గుర్తించి చేర్పించాలని ఆదేశించారు. 30 అంగన్‌వాడీ కేంద్రాల్లో అసలు పిల్లలు లేరని, 198 కేంద్రాల్లో 5లోపు, 586 కేంద్రాల్లో 10లోపే ఉన్నారన్నారు. చిన్నారులకు అందించే పోషకాహారంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి గ్రేడింగ్‌ ఇస్తామని చెప్పారు. మంచి గ్రేడింగ్‌ వచ్చిన కేంద్రాల సిబ్బందికి, ఎక్కువ కేంద్రాలు ఎంపికైన జిల్లా అధికారులకు అవార్డులు ప్రకటిస్తామని తెలిపారు.

Updated Date - Apr 11 , 2025 | 04:03 AM