Share News

Tummala Nageswara Rao : గత ప్రభుత్వంలో పేదల నోట్లో మన్ను

ABN , Publish Date - Apr 20 , 2025 | 05:35 AM

గత ప్రభుత్వంలో పేదల నోట్లో మట్టి కొట్టిన ప్రభుత్వంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శలు చేశారు. సన్న బియ్యం పథకాన్ని అమలు చేసి, పేదలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు

Tummala Nageswara Rao : గత ప్రభుత్వంలో పేదల నోట్లో మన్ను

  • సన్న బియ్యంతో కడుపు నింపుతున్న కాంగ్రెస్‌

  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గత ప్రభుత్వ హయాంలో పేదల నోట్లో మట్టి కొట్టారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి, పేదల నోట్లో మన్ను కొట్టి, నోట్ల కట్టలతో బియ్యం మాఫియా లాభపడిందని మండిపడ్డారు. ఈ పరిస్థితిని గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదెంపాడులో సన్న బియ్యం లబ్ధిదారుడు గుడిబండ్ల రాజారావు ఇంట్లో ఖమ్మం ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీజ, సీపీ సునీల్‌దత్‌తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భోజనం చేశారు. ఈ సందర్భంగా రాజారావుతో మాట్లాడి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు.


తమకు ఇల్లు కూడా లేదని రాజారావు చెప్పడంతో.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్టు తుమ్మల ప్రకటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు సన్న బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో రైతులకు క్వింటాకు రూ.500 బోనస్‌ ఇచ్చి మరీ సన్న ధాన్యం సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గతంలో సన్న రకాల సాగు 20 శాతం ఉండగా రైతులకు బోనస్‌ ఇవ్వడం వల్ల వానాకాలంలో 60 శాతం, యాసంగిలో 80 శాతం సన్న ధాన్యం సాగయిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజారావు దంపతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూతన వస్త్రాలను అందించారు.

Updated Date - Apr 20 , 2025 | 05:35 AM