నీరులేని తొట్టెలు.. మూగజీవాల పాట్లు
ABN , Publish Date - Apr 21 , 2025 | 10:44 PM
ఎండలు మండిపోతున్నాయి.. చెరువులు, వాగుల్లో నీరు ఇంకిపోతున్నాయి. గ్రామాల్లో పశుగ్రాసం, నీరుదొరకక మూగజీవాలు దాహంతో అలమటిస్తున్నాయి. పశువుల దాహార్తి తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు అధికారుల అవగాహన తేమితో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.

- లక్షల రూపాయల వ్యయం....తీరని దాహం
- నీటి తొట్టెలపై అధికారుల నిర్లక్ష్యం
వాంకిడి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఎండలు మండిపోతున్నాయి.. చెరువులు, వాగుల్లో నీరు ఇంకిపోతున్నాయి. గ్రామాల్లో పశుగ్రాసం, నీరుదొరకక మూగజీవాలు దాహంతో అలమటిస్తున్నాయి. పశువుల దాహార్తి తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు అధికారుల అవగాహన తేమితో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. అవసరంలేని ప్రదేశాలు, నీటి వసతి లేని స్థలాల్లో నిర్మాణాలు చేపట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నీటి తొట్టెలు నాసిరకంగా ఉండడంతో ఏళ్లు గడవముందే పగుళ్లు తేలి ప్రజాధనం మట్టిపాలవుతోంది. గ్రామాల్లో ఉన్న బోర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన పంచాయతీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతోంది.
- ఉపాధిహామీ పథకంలో నిర్మాణాలు
జిల్లాలోని 15 మండలాల్లో దాదాపు ఎనిమిది లక్షలకు పైగా పశువులు, మూగజీవాలు ఉన్నాయి. వేసవికాలంలో గ్రామాల సమీపంలోని వాగులు, ఒర్రెలు, చెరువులు ఎడారులుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి దాహార్తి తీర్చేందుకు 2013లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ఒక్కో దానికి 14వేల రూపాయలు వెచ్చించి జిల్లా వ్యాప్తంగా 428 నీటితొట్టెలు నిర్మించారు. వీటి నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించారు. కొన్నిచోట్ల వినియోగంలోలేక శిథిలావస్థకు చేరుకోగా మరికొన్ని చోట్ల ఒక్కనాడు కూడా వీటిలో నీరు నిల్వచేసిన దాఖలాలు లేవు. దీంతో మూగజీవాల దాహం తీరక లక్షలాది రూపాయల ప్రజాధనం వృఽథా అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నీటి తొట్లు నిరుపయోగంగా ఉండడంతో ఇంటి పరిసర ప్రాంతాల్లో, అక్కడక్కడ నిల్వ ఉన్న మురుగునీటితో మూగజీవాలు దాహార్తి తీర్చుకుంటున్నాయి.
- నీటి తొట్టెలను ఉపయోగంలోకి తీసుకురావాలి
బండె తుకారాం- మాజీ సర్పంచ్, వాంకిడి
మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు జాతీయ ఉపాధి హామీ పథకంలో నిర్మించిన నీటి తొట్టెలను అధికారులు ఉపయోగంలోకి తీసుకురావాలి. వేసవిలో చెరువులు, కాలువలు, వాగుల్లో నీరు ఇంకిపోయి పశువులకు దాహార్తి తీర్చేందుకు ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం నిర్మిచిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉండడంతో ఇంటి సమీపంలో నిల్వ ఉన్న మురుగునీటిని మూగజీవాలు తాగుతున్నాయి. అధికారులు నీటి తొట్టెలను ఉపయోగంలోకి తీసుకువచ్చి పశువుల దాహార్తిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలి.
మండలాల వారీగా నిర్మించిన నీటి తొట్టెలు
ఆసిఫాబాద్---------------11
వాంకిడి ---------------08
బె జ్జూరు ----------------06
జైనూరు ----------------55
చింతలమానెపల్లి------------01
దహెగాం----------------74
తిర్యాణి-----------------28
సిర్పూర్(టి)---------------06
సిర్పూర్(యు)--------------41
రెబ్బెన ------------------14
లింగాపూర్ ---------------15
కౌటాల -----------------10
కెరమెరి -----------------78
కాగజ్‌నగర్ ---------------81
=====================
మొత్తం 428
=====================