Share News

మూగ రోదన

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:31 PM

వేసవి వచ్చిదంటే పశువులకు మేత కష్టాలు తప్పడంలేదు. వేసవికాలంలో మేత, నీరు దొరక్క మూగ జీవాలు అల్లాడుతున్నాయి. పశుగ్రాసం కరువు అవడంతో రైతులు పొరుగు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

మూగ రోదన

- పశుగ్రాసం దొరకక అల్లాడుతున్న మూగజీవాలు

- వరిసాగు తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు

- పొరుగు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్న రైతులు

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): వేసవి వచ్చిదంటే పశువులకు మేత కష్టాలు తప్పడంలేదు. వేసవికాలంలో మేత, నీరు దొరక్క మూగ జీవాలు అల్లాడుతున్నాయి. పశుగ్రాసం కరువు అవడంతో రైతులు పొరుగు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మేత కంటే దాని రవాణే వారికి తడిసి మోపెడవుతోంది. లారీ గడ్డి 25వేల రూపాయల నుంచి 30 వేల రూపాయల వరకు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వివిధ గ్రామాల్లో రైతులకు పశు పోషణ పెను భారంగా మారింది. జిల్లాలో వరి పంట అతి తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. జిల్లాలో దహెగాం, సిర్పూర్‌(టి), తిర్యాణి, రెబ్బెన, కౌటాల, బెజ్జూరు, కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మండలాల్లో మాత్రమే వరి సాగు చేస్తుంటారు. వాంకిడి, కెరమెరి, జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండలాల్లో నీటి లభ్యత లేని కారణంగా అక్కడి రైతులు ఆరుతడి పంటలైన పత్తి, సోయా పంటలనే పండిస్తుంటారు. దీంతో ప్రస్తుతం గ్రామాల్లో గ్రాసం కోసం రైతులు ఇబ్బందులు పడుతూ ఈ వేసవిలో పశువులకు గ్రాసం ఎలా సమకూర్చాలో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో పశు సంపద..

కుమరం భీం జిల్లాలో 10,17,833 పశువులు ఉండగా ఆవులు 2,78,674, బర్రెలు 51,354, గొర్రెలు 83,813, మేకలు 1,84,726 ఉన్నట్లు పశువైద్యాధికారులు చెబుతున్నారు. వీటన్నింటికి సరిపడా గ్రాసం లేక ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అనుకున్నంత స్థాయిలో వరి సాగు చేయకపోవడంతో పక్క జిల్లాలైన మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌ తదితర ప్రాంతాల నుంచి రైతులు వరి గడ్డిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గడ్డి కొరత ఏర్పడి డిమాండ్‌ బాగా పెరిగింది. వరి గడ్డి కట్టకు రూ.120నుంచి రూ.130 ధర ఉండగా, లారి గడ్డి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టి కొనాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పశు వైద్య కేంద్రాల ద్వారా గ్రాసం సరఫరా చేస్తే తమకు కొంతైనా ఊరట లభిస్తుందని జిల్లాలోని రైతులు విన్నవించుకుంటున్నారు.

ప్లాస్టిక్‌ కవర్లను తింటూ.. ముగురునీరు తాగుతూ..

జిల్లా అంతటా పశుగ్రాసం కొరత తీవ్ర రూపం దాల్చింది. పశుగ్రాసం కోసం రైతులు చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. పశుగ్రాసం దొరకక పశువులు విలవిలలాడుతున్నాయి. ఓ వైపు తాగునీరు, మరో వైపు పశుగ్రాసం లభించక పశువులు బక్కచిక్కి పోతున్నాయి. దీంతో రైతులకు పశు పోషణ భారం కావడంతో కబేళాలకు అమ్మేస్తున్నారు. ఇక ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణ ప్రాంతంలో పశువుల తీరు దయనీయంగా మారింది. గ్రాసం దొరకక చెత్త కుప్పలపై ఉన్న కాగితాలను, ప్లాస్టిక్‌ కవర్లను తింటూ మురికి కాలువల్లో నీటిని తాగుతూ రోగాల బారిన పడుతున్నాయి. ఇప్పటి వరకు పశుగ్రాసం కొరతను తీర్చేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు నీటి వసతి ఉన్న ప్రాంతాలను గుర్తించి పశుగ్రాసం పెంచే విధంగా రైతుల్లో అవగాహన కల్పించడం లేదంటున్నారు. పశు సంవర్ధక శాఖాధికారులు పట్టించుకోక పోవడంతో పశుగ్రాసాన్ని పెంచేందుకు ఆసక్తి చూపడం లేదు.

కబేళాలకు తరలుతున్న పశువులు..

పశుపోషణ భారంగా మారడంతో రైతులు వాటిని కబేళాలకు తరలిస్తున్నారు. రైతులు అల్లారుముద్దుగా పెంచుకున్న తమ పశువుల ఆకలి కేకలను వినలేక దయనీయ దుస్థితిని చూడలేక దాళారులకు అమ్ముకుంటున్నారు. పాడి పశువులు కళ్ల ముందే కబేళాలకు తరలి పోతున్న తీరును చూస్తూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్థానిక దళారులు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన దళారులు పలు గ్రామాల్లో పశువులను కొనుగోలు చేస్తూ రాత్రికి రాత్రే కబేళాలకు చేరవేస్తున్నారు.

పొరుగు జిల్లాల నుంచి పశుగ్రాసం తెస్తున్నాం..

- గజ్జల రాజన్న, రైతు, ఆసిఫాబాద్‌

పశుగ్రాసం కొరత తీవ్రంగా ఏర్పడడంతో మంచిర్యాల జిల్లా దండెపల్లి, లక్షెటిపేట నుంచి వరి గడ్డిని కొనుగోలు చేసి తీసుకు వస్తున్నాం. జిల్లాలో వరిసాగు అంతంత మాత్రంగానే ఉండడంతో పోరుగు జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. లారీ పశుగ్రాసానికి రూ.25 వేల నుంచి రూ.30 వేలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో రైతులపై ఆర్థికంగా భారం పడుతోంది.

Updated Date - Apr 16 , 2025 | 11:31 PM