Share News

అదాని గ్రూప్‌ చేతికి ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ

ABN , Publish Date - Apr 23 , 2025 | 11:38 PM

మారుమూల గిరిజన ప్రాంతం దేవాపూర్‌లో నాలుగున్నర దశాబ్దాల క్రితం బీర్లా యాజమాన్యం ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీని స్థాపించింది. అనతికాలంలోనే ఆసియా ఖండంలో దిగ్గజ సిమెంట్‌ కంపెనీగా ఎదిగింది.

అదాని గ్రూప్‌ చేతికి ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ
దేవాపూర్‌ ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ ముఖ ద్వారం

కాసిపేట, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): మారుమూల గిరిజన ప్రాంతం దేవాపూర్‌లో నాలుగున్నర దశాబ్దాల క్రితం బీర్లా యాజమాన్యం ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీని స్థాపించింది. అనతికాలంలోనే ఆసియా ఖండంలో దిగ్గజ సిమెంట్‌ కంపెనీగా ఎదిగింది. కాని కాలక్రమేణా పెరిగిన ఆర్థిక మాంద్యంతో కంపెనీ కొంత ఆర్థిక నష్టాల్లో కూరకపోయింది. కొంతకాలంగా ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీని అదాని కంపెనీ కొనుగోలు చేస్తుందనే ప్రచారం ఊపందుకుంది. ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీని గురువారం నుంచి ఆధీనంలోకి తీసుకొని అందరి అనుమానాలకు అదానీ యాజమాన్యం తెరదించింది. గురువారం నుంచి ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీకి సంబందించిన లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు, సంస్థాగత నిర్ణయాలు మొత్తం అదాని గ్రూపునకు అధికారికంగా బదిలీ చేశారు. ఓరియంట్‌ బోర్డులు ఉన్న చోట అదానీ గ్రూపు పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నాలుగున్నర దశాబ్దాలు ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ పేరు నేటి నుంచి కనుమరుగుకానుంది.

- నాలుగు ప్లాంట్లకు విస్తరణ...

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్‌ ఆదివాసీ గిరిజన ప్రాంతంలో 1980లో ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీని బీర్లా యజామాన్యం ప్రారంభించింది. నాలుగున్నర దశాబ్దాల కాలంలో నాలుగు ప్లాంట్లకు విస్తరించి సిమెంట్‌ రంగంలో గణనీయమైన చరిత్రను తిరగరాసింది. 1987లో రెండో ప్లాంట్‌, 2007లో మూడో ప్లాంట్‌ ప్రారంభం అయింది. 2023లో నాలుగో ప్లాంట్‌కు అప్పటి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ భూమి పూజ చేశారు. నాలుగో ప్లాంట్‌ పూర్తి స్థాయిలో పని పూర్తిచేయకుండానే అదానీ గ్రూపులోకి వెళ్లిపోయింది. ఓరియంట్‌ యాజమాన్యం నాలుగు ప్లాంట్లే కాకుండా కర్ణాటకలోని చిత్తాపూర్‌, మహారాష్ట్రలోని జల్‌గాంలో సైతం సిమెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసింది.

Updated Date - Apr 23 , 2025 | 11:38 PM