Share News

అన్నదాతలకు ధీమా.. ‘ఇఫ్కో సంకటహరణ బీమా’

ABN , Publish Date - Jul 28 , 2025 | 11:32 PM

సహకార సంఘాల నుంచి ఇఫ్కో ఎరువులను కొనుగోలు చేసే ప్రతీ రైతుకు ఆ సంస్థ ఉచితంగా సంకటహరణ బీమా పథకాన్ని వర్తింపజేస్తోంది.

అన్నదాతలకు ధీమా..  ‘ఇఫ్కో సంకటహరణ బీమా’

- సహకార సంఘాల ద్వారా ఎరువులు తీసుకున్న రైతులకు వర్తింపు

- కొనుగోలు చేసిన నెల రోజుల నుంచి 12 నెలల వరకు

- అత్యధిక పరిమితి రూ. రెండు లక్షలు

వాంకిడి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘాల నుంచి ఇఫ్కో ఎరువులను కొనుగోలు చేసే ప్రతీ రైతుకు ఆ సంస్థ ఉచితంగా సంకటహరణ బీమా పథకాన్ని వర్తింపజేస్తోంది. రైతులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. సంస్థ ఎరువులను కొనుగోలు చేస్తే చాలు ప్రమాదాల్లో మృతి చెందినా, అంగవైక ల్యం సంభవించినా వారికి ఈ బీమా వర్తిస్తుంది.

అర్హతలు ఇలా...

ప్రాథమికంగా రైతులు సహకార సంఘాల ద్వారా ఇఫ్కో ఎరువులను కొనుగోలు చేయాలి.

వీటిని కొనుగోలు చేసిన రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే వందశాతం, రెండు అవయవాలు కొల్పోతే 50 శాతం, ఒక అవయవం కోల్పోతే 25 శాతం బీమా పరిహారం అభిస్తుంది.

కొనుగోలు చేసిన నెల రోజుల నుంచి 12 నెలల వరకు ఈ బీమా ప్రయోజనం ఉంటుంది.

రహదారి ప్రమాదాలు, నీటిలో మునిగిపోవడం, పాముకాలు, గ్యాస్‌ సిలిండర్‌ పేలడం, అగ్ని యంత్రాలవల్ల కలిగే ప్రమాదాలకు ఇది వర్తిస్తుంది.

ప్రతి ఎరువు బస్తా లేదా నానో ఎరువు బాటిల్‌పై 10వేల రూపాయల బీమా వర్తిస్తుంది.

అత్యధిక బీమా పరిమితి రెండు లక్షల రూపాయలు.

దేనికి వర్తించదు?

ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ప్రమాదాలకు వర్తించదు.

- కొనుగోలు సమయంలో...

రసీదుపై తేదీ, కొనుగోలుదారుడి పేరు, తండ్రి లేదా భర్త పేరు, చిరునామా, కొనుగోలు చేసిన ఇఫ్కో ఎరువుల సంఖ్య, నామినీ పేరు, కొనుగోలుదారుడి సంతకం, వేలి ముద్ర ఉండాలి. బీమా ప్రయోజనం పొందడానికి కొనుగోలు అసలు రసీదుపత్రం అవసరం. రసీదుతో పాటు కొనుగోలు వివరాల ధ్రువీకరకణకు విక్రయాల రిజిస్టర్‌ నకలు పత్రం, పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కాపీ, వైద్యుడి చికిత్స నివేదిక, పోస్ట్‌మార్టం నివేదిక, మరణ ధ్రువపత్రం సమర్పించాలి. క్లైయిం పత్రాలను ప్రమాదం సంభవించిన తేదీ నుంచి రెండు నెలల్లోగా సికింద్రాబాద్‌లోని ఇఫ్కో టోకియో సాధారణ బీమా కంపెనీ లిమిటెడ్‌కు పంపించాలి.

రైతులకు ఎంతో ప్రయోజనకరం..

- జబ్రే పెంటు, పీఏసీఎస్‌ చైర్మన్‌, వాంకిడి

ఇఫ్కో సంకటహరణ బీమా రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సహకార సంఘం నుంచి ఇఫ్కో ఎరువులు తీసుకున్న ప్రతీ రైతుకు ఈ బీమా వర్తిస్తుంది. బీమా క్లైయిం కోసం అవసరం ఉన్న ధ్రువపత్రాలను రైతులకు అందుబాటులో ఉంచుకోవాలి.

Updated Date - Jul 28 , 2025 | 11:32 PM