Share News

పుట్టగొడుగుల్లా హాస్టళ్లు

ABN , Publish Date - Jul 31 , 2025 | 11:47 PM

హాస్టళ్ల నిర్వహణ నేటి రోజుల్లో లాభసాటి వ్యాపారంగా మారింది. విద్యాసంస్థలకు అనుగుణంగానేగాక వర్కింగ్‌ మెన్‌, ఉమెన్‌ హాస్టళ్ల పేరుతో కుప్పలుతెప్పలుగా వసతి గృహాలు పుట్టుకొస్తున్నాయి.

 పుట్టగొడుగుల్లా హాస్టళ్లు

- కనీస పర్యవేక్షణ కరువు

- ప్రైవేటు విద్యాసంస్థలకు అనుబంధంగా ఏర్పాటు

- వసతి పేరుతో విద్యార్థుల నుంచి అడ్డగోలు వసూళ్లు

- పర్యవేక్షణ అధికారం తమకు లేదంటున్న విద్యాశాఖ

- కనీస సౌకర్యాలు లేక విద్యార్థుల అవస్థలు

మంచిర్యాల, జూలై 31 (ఆంధ్రజ్యోతి): హాస్టళ్ల నిర్వహణ నేటి రోజుల్లో లాభసాటి వ్యాపారంగా మారింది. విద్యాసంస్థలకు అనుగుణంగానేగాక వర్కింగ్‌ మెన్‌, ఉమెన్‌ హాస్టళ్ల పేరుతో కుప్పలుతెప్పలుగా వసతి గృహాలు పుట్టుకొస్తున్నాయి. అసలు హాస్టళ్ల ఏర్పాటు, నిర్వహణపై పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వపరంగా ఓ శాఖ అంటూ లేకపోవడంతో నిర్వాహకులకు ఆడిందే ఆటగా తయారైంది. ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహిస్తున్న హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యత పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్‌ అధికారులపై ఉంటుంది. ఆయా హాస్టళ్లపై అవసరమైతే కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారుల అజమాయిషీ కూడా ఉంటుంది. దీంతో మెనూ, ఇతర సౌకర్యాల కల్పనపై అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. అదే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు అనుబంధంగా ఏర్పాటవుతున్న హాస్టళ్లలో పర్యవేక్షణ బాధ్యతలు అటు విద్యాశాఖకుగానీ, ఇంటర్మీడియట్‌ అధికారులకుగాని లేవు. దీంతో అరకొర సౌకర్యాల మధ్య విద్యార్థులు ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఫ ధనార్జనే ధ్యేయం....

జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్న హాస్టళ్లలో నిర్వాహకులు కేవలం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. హాస్టళ్ల పేరిట వేలకు వేలు ఫీజులు దోచుకుంటున్నా అడిగేవారు లేరు. అడ్మిషన్ల సమయంలో చెప్పిన విధంగా ఎక్కడా కూడా మెనూ, ఇతర సౌకర్యాలు కల్పించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎక్కడ చూసినా దాదాపుగా అనుబంధ హాస్టళ్లు ఏర్పాటు అవుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాస్టల్‌ ఉంటేనే ఆయా విద్యాలయాల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇంటిపట్టున ఉంటే చదువుపై ఆసక్తి ఉండదనే ఉద్దేశంతో హాస్టళ్లు ఉన్న స్కూళ్లు, కాలేజీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫీజుల విషయం ఆలోచించకుండా తమ పిల్లలను హాస్టళ్లలో చేర్పిస్తున్నా రు. అయితే పోషకుల అవసరాన్ని అవకాశంగా మలుచుకుంటున్న హాస్టళ్ల నిర్వాహకులు వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. అకాడమిక్‌ ఫీజులతో పోలిస్తే స్కూళ్లు, కాలేజీల్లో ఉన్న హాస్టళ్ల నిర్వహణ ద్వారానే యజమానులకు భారీ సంపాదన ఉంటుందన్న ప్రచారమూ ఉంది.

ఫ నిబంధనలు ఇలా....

ప్రైవేటు హాస్టల్‌ ప్రారంభించేవారు విధిగా సంబంధిత స్థానికసంస్థల నుంచి ముందస్తు అనుమతులు పొందాలనే నిబంధన ఉంది. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న హాస్టళ్లకు మున్సిపల్‌ అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు అనుమతి పత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. స్థానిక సంస్థలు జారీ చేసే అనుమతులు ఉంటేనే హాస్టళ్లు నిర్వహించాలనే నిబంధన ఉంది. హాస్టళ్లలో శానిటేషన్‌, వెంటిలేషన్‌, తాగునీరు, టాయ్‌లెట్ల పరిశుభ్రతపై తనిఖీలు నిర్వహించే అధికారం కూడా స్థానికసంస్థల అధికారులకు ఉంటుంది. విద్యాసంస్థలు ప్రారంభించే ముందు ఆయా స్థానిక సంస్థల.. అధికారుల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (సౌండ్‌నెస్‌ సర్టిఫికేట్‌) పొందాల్సి ఉంటుంది. దాంతోపాటు అగ్నిమాపకశాఖ అనుమతులు కూడా తీసుకోవాలి. అవే నిబంధనలు హాస్టళ్లకు కూడా వర్తిస్థాయి. అయితే ఆ ఎన్‌వోసీలు కేవలం విద్యాసంస్థల పర్మిషన్‌ సమయంలో తయారు చేస్తున్న ఫైళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్‌వోసీలు జారీచేస్తున్న సంబంధిత అధికారులు ఆ తరువాత పర్యవేక్షణ జరపకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ ఇష్టారీతిన సాగుతోంది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాల్లో ఉన్న హాస్టళ్లలో తనిఖీలు చేసేవారు లేకపోవడంతో అక్కడ ఎన్నెన్ని సంఘటనలు జరుగుతాయో ఊహకందని విషయం.

ఫ రక్షణ చర్యలు కరువు...

ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న హాస్టళ్లలో కనీస రక్షణ చర్యలు పాటించడంలేదు. ఇరుకు గదుల్లో విద్యార్థులను కుక్కుతున్నా పట్టించుకునేవారు లేరు. ఒక్కో గదిలో కనీసం పదిమంది వరకు విద్యార్థులకు వసతి కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. బాత్రూంల వద్ద తెల్లవారుజాము నుంచే విద్యార్థులు క్యూలు కట్టాల్సిన పరిస్థితి. ఇక మెనూ అమలు దేవుడెరుగు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల గోడు వినే ఓపికా, సమయం తల్లిదండ్రులకు లేకపోగా, ధనార్జనే ధ్యేయంగా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్న యాజమాన్యాలకు వారి బాగోగులే అవసరం లేకుండా పోయాయి.

మూడు నాలుగు అంతుస్తుల్లో హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు కనీసం లిఫ్ట్‌ సౌకర్యం కూడా కల్పించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. అగ్నిప్రమాదాలు సంభవించిన పక్షంలో భవనం చుట్టూ ఫైరింజన్‌ తిరిగేలా ఏర్పాట్లు ఉండాలి. జిల్లావ్యాప్తంగా 30 నుంచి 40 హాస్టళ్లు ఉండగా, ఎక్కడా ఆ వెసులుబాటు లేదు. దీంతో అనుకోని ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు భారీమూల్యం చెల్లించుకోకతప్పదు. చిన్నపిల్లల హాస్టళ్లఓ కిటికీలకు గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలి. రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలో ఇంటర్‌ విద్యార్థిని హాస్టల్‌ నుంచి పడిపోయిన సంఘటనలో కిటికీకి గ్రిల్స్‌ లేకపోవడం గమనార్హం.

హాస్టళ్ల పర్యవేక్షణ మా పరిధి కాదు..

- డీఈవో యాదయ్య

ప్రైవేటు విద్యాసంస్థలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్న హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యత మాదికాదు. కేవలం పాఠశాలల నిర్వహణ పర్యవేక్షణ మాత్రమే మాపై ఉంటుంది. ప్రైవేటు హాస్టళ్లలో విద్యార్థులను చేర్పించడం వారి తల్లిదండ్రుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యత మేమే వహిస్తాం.

సంబంధిత అధికారులు పర్యవేక్షించాలి..

డి శ్రీకాంత్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ప్రారంభ సమయంలో ఎన్‌వోసీలు జారీచేస్తున్న మున్సిపల్‌, పంచాయతీ అధికారులే పర్యవేక్షణ జరపాలి. కేవలం సర్టిఫికేట్‌ జారీతోనే సరిపెట్టకుండా నిర్వహణపై కూడా వారు ధృష్టిసారిస్తే విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తారు. కలెక్టర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు ప్రైవేటు హాస్టళ్లను పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. అనుమతులు లేని హాస్టళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

Updated Date - Jul 31 , 2025 | 11:48 PM