Share News

మహిళల శ్రేయస్సుకు ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:31 PM

మహిళల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తోందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.

మహిళల శ్రేయస్సుకు ప్రభుత్వం పెద్దపీట
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌దీపక్‌

- కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): మహిళల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తోందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో మహిళ సమాఖ్య సభ్యులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళ శక్తి సంబరాలు జిల్లాలో విజయవంతం అయ్యాయని తెలిపారు. ప్రభుత్వం మహిళ సంక్షేమం, ఆర్ధిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనుల్లో జిల్లా మహిళ సమాఖ్య సభ్యులను భాగస్వాములను చేసి వచ్చిన నిధుల్లో మూడు శాతం కమీషన్‌ ఇస్తున్నామన్నారు. మునగ సాగుపై ఆసక్తి ఉన్న మహిళలు తమ సొంత భూమిలో పత్తితో పాటు అంతర పంటగా సాగు చేసుకోవచ్చని, తద్వారా ఎకరానికి లక్ష రూపాయల వరకు అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. ఇందుకు అవసరమైన మొక్కలను ఉపాధి హామీ పథకం నర్సరీలో పెంచాలన్నారు. మహిళ సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంక్‌ నిర్వహించేందుకు మందమర్రి మండలానికి మంజూరు చేశామని తెలిపారు. అనువైన స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, లీటరుకు రూ. 2.5 కమీషన్‌ వస్తుందన్నారు. రాజీవ్‌ యువ వికాసం పథకంలో వాహనం తీసుకుని ఆసక్తి గల మహిళలు డ్రైవింగ్‌ శిక్షణ పొందాలని సూచించారు. మంచిర్యాల పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ పక్కన గల జిల్లా సమాఖ్య కార్యాలయంలో ఇందిరా మహిళ శక్తి బజార్‌గా మార్చి మహిళలు తయారు చేసే అన్ని రకాల ఉత్పత్తులను విక్రయించాలని తెలిపారు. అన్నిరంగాల్లో రాణించేలా ప్రభుత్వం అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్థిక చేయూత అందించి ప్రోత్సహిస్తోందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ కార్యాయంలో డీసీపీ భాస్కర్‌తో కలిసి పోలీసు, రవాణా, ఆర్టీసీ, రహదారుల సంస్థ, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడు తూ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాలు జరగకుం డా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ ఏర్పాటు చేసే అధికారులు రహదారులు, పైపులైన్‌లు దెబ్బతినకుండా పనులను చేయాలన్నారు. రహదారులపై పశువుల వల్ల జరిగే ప్రమాదాలను నివారిం చేందుకు పశువు లను చెన్నూరులోని గోశాల కు తరలించాలని, మంచిర్యాలలో గోశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ రెండోసారి పట్టుబడితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయాలన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో 47 లైసెన్స్‌లను రద్దు చేశామన్నారు. మూల మలుపులు, వేగ నిరోధకాలు, వేగ పరిమితి, యూ టర్న్‌ ఇతర సూచికలను ఏర్పాటు చేసి వాహనదారుల రక్షణకు చర్యలు తీసుకోవాల ని సూచించారు. జిల్లాలోని జన్నారం, శ్రీరాం పూర్‌లో బస్సులు రోడ్లపై నిలుపడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, బస్టాండ్‌ లోపలికి వెళ్లి వచ్చేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏసీపీలు ప్రకాష్‌, వెంకటేశ్వర్లు, రవికుమార్‌, జిల్లా రవాణా శాఖ అధికారి సంతోష్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 11:31 PM