భూభారతిపై రైతులు అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:07 PM
భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. దహెగాం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి నూతన చట్టంలో పొందుపరిచిన అంశాలపై రైతులకు సోమవారం అవగాహన కల్పించారు.

- కుమరంభీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
దహెగాం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. దహెగాం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి నూతన చట్టంలో పొందుపరిచిన అంశాలపై రైతులకు సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూ భారతి నూతన ఆర్‌వోఆర్ చట్టాన్ని ప్రారంభించిందన్నారు. ఈ చట్టం ద్వారా రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఈ చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. రైతులకు భూమి ఎంతో ముఖ్యమని, ఎలాంటి భూ సమస్యలు లేకుండా భూ భారతి చట్టం ద్వారా పరిష్కరించేందుకు వీలుందన్నారు. భూ భారతి చట్టంలో అటవీ, రెవెన్యూ సరిహద్దు సమస్యలను జాయింట్ సర్వే నిర్వహించి పరిష్కరిస్తామని, రికార్డుల్లో తప్పులు ఉంటే సరిచేసేందుకు అవకాశం ఉందని, ముఖ్యంగా భూ భారతిలో అప్పీల్ వ్యవస్థ చాలా కీలకమని వివరించారు. తహసీల్దార్ జారీ చేసిన ఉత్తర్వులపై రైతుకు న్యాయం జరగకపోతే ఆర్డీవో అధికారి, సబ్ కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చని, అక్కకా న్యాయం జరగకపోతే కలెక్టర్ ద్వారా న్యాయం పొందచవ్చని తెలిపారు.
ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ భూ భారతి చట్టం అమలు ద్వారా గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందని తెలిపారు. ఈ చట్టం రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం 18 రాష్ట్రాల్లో చట్టాలను అధ్యయనం చేసిందని, ఈ చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అయిందని వివరించారు. పార్ట్-బిలో పెండింగ్‌లో లేని భూమికి పరిష్కారం జరుగుతుందన్నారు. రైతుల సంక్షేమం దిశగా భూ భారతి చట్టంను రాష్ట్ర రూపొందించిందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, వ్యవసాయ సంచాలకులు మనోహర్, తహసీల్దార్ కవిత, వ్యవసాయాధికారులు, రెవెన్యూ సిబ్బంది, మాజీ జడ్పీ చైర్మన్ గణపతి, మాజీ జడ్పీటీసీ శ్రీరామరావు, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.