‘ఉపాధి’ చదువులు
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:30 PM
పాఠశాల స్థాయిలో వృత్తివిద్య కోర్సులను మరింతగా అందుబాటులోకి తీసుకరావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

- ప్రభుత్వ పాఠశాలల్లో వృత్తివిద్య
- కొత్తగా 19 కోర్సులు ప్రారంభం
- స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా బోధన
- జిల్లాలో 11పాఠశాలల్లో అందుబాటులో కోర్సులు
బెజ్జూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): పాఠశాల స్థాయిలో వృత్తివిద్య కోర్సులను మరింతగా అందుబాటులోకి తీసుకరావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల లభ్యత, వృత్తివిద్యా కోర్సుల అధ్యయనానికి సామగ్రి అమర్చేందుకు తగిన వసతులు ఉన్న పాఠశాలలను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా 241 ఎంపిక చేసింది. ఇందులో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 11 పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలోని ఆసిఫాబాద్, చింతలమానేపల్లి, జైనూరు, కాగజ్‌నగర్, కెరమెరి, కౌటాల, పెంచికలపేట, రెబ్బెన, వాంకిడి పాఠశాలలను ఎంపిక చేశారు.
19 రకాల వృత్తి కోర్సులు..
మొత్తం 19 రకాల వృత్తివిద్య కోర్సులు అందుబాటులో ఉంచి పదో తరగతి వరకు ఉన్న పాఠశాలలకు వాటిలో రెండు కోర్సులను ఎంచుకోవాలని ప్రభుత్వం సూచించింది. పదోతరగతి పూర్తయిన తర్వాత స్వయం ఉపాధి కల్పించే జనాదరణ పొందిన కోర్సులు అందిస్తారు. ఇందుకు అర్హతలున్న బోధకులను నియమిస్తారు. విద్యార్థుల ఆసక్తి మేరకు అదే ఆవాసంలో లేదా సమీప పట్టణంలో మంచి ఆదరణ కలిగిన రెండు కోర్సులను ఎంచుకొని తమకు సమాచారం అందిస్తే అందుకు తగిన ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. పదో తరగతి కీలకం కావడంతో రెగ్యూలర్ తరగతుల బోధనకు అంతరాయం కలగకుండా అదనపు సమయంలో వృత్తివిద్య కోర్సులు నేర్పిస్తారు. పాఠశాల బోధనతో పాటు ప్రాక్టికల్ తరగతులు నిర్వహిస్తారు. వ్యవసాయానికి సంబంధించిన కోర్సుల్లో క్షేత్ర సందర్శన కూడా ఉంటుంది. స్థానికంగా అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా కోర్సులను ఎంపిక చేసుకునే బాధ్యత ఆయా పాఠశాలల ఉపాధ్యాయులదే. పదో తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో రెండు దశల్లో వృత్తివిద్య బోధిస్తారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు లెవల్-1పేరిట ఏదైనా కోర్సు నేర్చుకోవాలని మానసికంగా సిద్ధం చేస్తారు. రెండో దశలో విద్యార్థులు కిందటి తరగతిలో పేర్కొన్న కోర్సుకు తగిన శిక్షణపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తారు. పదో తరగతి వార్షిక పరీక్షలు ముగిసే నాటికి విద్యార్థులు నేర్చుకున్న అంశంలో పట్టు సాధించేలా శిక్షణ ఇస్తారు. మిగతా రెండు దశలను ఇంటర్ వరకు ఉన్న విద్యా సంస్థల్లో అమలు చేస్తారు.
నైపుణ్యాలు లేక....
నైపుణ్యాలు లేకపోవడంతో ఎంతో మంది గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టభద్రులు నేడు ఉపాధికి నోచుకోలేకపోతున్నారు. అలాగని మార్కెట్‌లో అవకాశాలు లేవని కాదు. కావల్సిందల్లా వాటిని ఒడిసిపట్టుకునేందుకు కావాల్సిన నైపుణ్యాలే అని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. చదువుతో పాటు భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా స్కిల్స్ నేర్చుకుంటున్న వారిని గ్లోబల్ కంపెనీలు వెతికి మరీ పట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రపంచ వ్యాప్త డిమాండ్‌కు తగ్గట్టుగా వృత్తివిద్య కోర్సులను బోధిస్తుంది. విద్యార్థులకు పదో తరగతితో పాటు వృత్తివిద్యను నేర్పిస్తే చదువు పూర్తయిన తర్వాత స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశముంటుంది. ఈ ఆలోచనతోనే పదేళ్ల క్రితం ఆదర్శ పాఠశాలల్లో వృత్తివిద్య కోర్సులు ప్రవేశ పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం వీటిని కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, పీఎం శ్రీ పాఠశాలలకూ విస్తరిస్తోంది. ఒక్కో బడిలో రెండేసి కోర్సులు ప్రవేశపెడుతున్నారు.
పలు అవకాశాలు....
ఇంటర్ ఒకేషనల్ కోర్సుగాని, ఐటీఐ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య అభ్యసించేందుకు విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయి. ఒకేషనల్ వారు జనరల్ విద్యార్థులతో సమానంగా బీఏ, బీకాం, డిగ్రీల్లో ప్రవేశాలు పొందవచ్చు. బ్రిడ్జీ కోర్సుతో బీఎస్సీ డిగ్రీ చేయవచ్చు. ఇంటర్ ఒకేషనల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఉత్తీర్ణులైనవారు నేరుగా పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో చేరే అవకాశం ఉంటుంది. రెండేళ్ల ఒకేషనల్ పూర్తి చేసిన వారు బ్రిడ్జీ కోర్సుతో నేరుగా ఎప్‌సెట్‌కు కూడా హాజరుకావచ్చు.
కొత్త కోర్సులు ఇవే..
అగ్రికల్చర్ టెక్నాలజీ
బ్యూటీషియన్
ఎలక్ర్టికల్ వైరింగ్
ఐటీ టెక్నాలజీ
హోమ్ ఫర్నీచర్
మీడియా ఎంటర్‌టైన్‌మెంట్
ప్లంబింగ్, స్పోర్ట్స్
ఫిజికల్ ఎడ్యుకేషన్
బ్యాంకింగ్
ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్
ఎలక్ర్టానిక్స్, అండ్ హార్డ్‌వేర్
ఫుడ్ ప్రాసెసింగ్
హెల్త్ కేర్
టూరిజం అండ్ హాస్పిటాలజీ
ఆటోమోటివ్
రిటైల్ మార్కెటింగ్
జీవితంలో స్థిరపడవచ్చు...:
- ఉప్పులేటి శ్రీనివాస్, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి
పాఠశాలల్లో ప్రారంభించిన వృత్తివిద్య కోర్సుల్లో చేరి విద్యనభ్యసించిన వారు వృత్తివిద్య ద్వారా జీవితంలో స్థిరపడవచ్చు. సులభంగా వృత్తివిద్యను చదవడం ద్వారా భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాబోయే రోజుల్లో వృత్తివిద్యకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.