పంటల బీమా పునరుద్ధరణకు కసరత్తు
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:12 PM
రాష్ట్రంలో రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం తాజాగా పంటల బీమా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సందర్భంగా పంట బీమా అమలు చేస్తామని హామీ ఇవ్వడంతో దాన్ని నెరవేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- వానాకాలం నుంచి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం యోచన
- ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశం
- రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
వాంకిడి, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం తాజాగా పంటల బీమా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సందర్భంగా పంట బీమా అమలు చేస్తామని హామీ ఇవ్వడంతో దాన్ని నెరవేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత బుధవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పంటల బీమా కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో రైతులు సంతోషిస్తున్నారు. వ్యవసాయం పూర్తిగా ప్రకృతి మీదే ఆధారపడి ఉండటంతో బీమా తప్పనిసరిగా భావిస్తున్నారు. సాంకేతిక ఆధారంగా పంటల దిగుబడి అంచనాల రూపకల్పన, నష్టం జరిగే ప్రాంతాల వర్గీకరణ తయారీకి అధికారులు సిద్ధమయ్యారు. సాధారణంగా వానాకాలంలో సాగుచేసే పంటలకు బీమా ఉంటుంది. కానీ ప్రస్తుతం వానాకాలం, యాసంగిలో సాగుచేసే అన్నిరకాల ప్రధాన పంటలకు బీమా వర్తించేలా ప్రణాళిక రచిస్తున్నారు. పెట్టుబడి సాయం కింద రైతుబంధు పథకం అమలుతో 2018 నుంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పంటల బీమాను నిలిపివేసింది. దీంతో ఆరేళ్లుగా రైతులు పలురకాలుగా నష్టపోయారు. ఏటా ఏదో ఒక విధంగా రైతులకు నష్టం జరుగుతూనే ఉంది.
- ప్రకృతి విపత్తుల ప్రభావం...
జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఏటా వానాకాలం, యాసంగి సీజన్‌లో 4.46 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో వానాకాలంలో 4.45 లక్షల ఎకరాలు, యాసంగిలో 41వేల ఎకరాలు వివిధ పంటలను సాగు చేస్తున్నారు. అటు వానాకాలం, ఇటు యాసంగిలో ఏదో ఒక కారణంతో పంటల దిగుబడి తగ్గుతూనే ఉంది. కొన్ని రకాల పంటలకు కనీసం పెట్టుబడి కూడా చేతికందడంలేదు. జిల్లాలో నీటి వనరుల శాతం తక్కువే. దీనికి తోడు ప్రకృతి విపత్తులు రైతులపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఫసల్ బీమా అమలు జిల్లా రైతులకు ప్రయోజనాన్ని చేకూర్చనుంది. బీమా ప్రీమియం చెల్లింపులోనూ రైతుకు భారాన్ని తగ్గించేలా చూస్తున్నారు 1.5 నుంచి రెండు శాతం వరకు ప్రీమియం చెల్లిస్తే మిగితా శాతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
- ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యమే....
పంట బీమా పథకం రాష్ట్రంలో 2018 నుంచి అమలుకు నోచుకోవడంలేదు. దీంతో పంటలు నష్టపోయిన రైతన్నలకు ఎలాంటి బీమా పరిహారం అందడంలేదు. గతంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల్లో కొంతమందికి మాత్రమే పదిరూపాయలు చెల్లించి చేతులు దులుపుకున్నారు. చాలా మందికి నష్టపరిహారం అందక ఆర్థిక కష్టాలు పడిన దాఖలాలు ఉన్నాయి. అలాకాకుండా బీమా పథకాలను అమలు చేస్తే ప్రీమియం చెల్లించిన అన్నదాతలకు నష్టపరిహారం అందించే అవకాశం ఉంటుందని బీమా పథకాన్ని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.
- అమలైతే ఎంతో ఊరట...
అతి, అనావృష్టితో పంటలు దెబ్బతిని రైతన్నలు అర్థికంగా నష్టపోతున్న ఘటనలు తరుచూ చూస్తునే ఉన్నాం. నీటి సౌకర్యం లేక పంటలు ఎండిపోయినా, అకాల వర్షాలతో నీట మునిగినా, వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నా, వన్యప్రాణుల దాడులతో పంటలు ధ్వంసమైనా, భారీఎత్తున తెగుళ్లు సోకినా బీమా పథకం రక్షణ కవచంలా పనిచేస్తుంది. పంట నష్టపోయిన ఇలాంటి సందర్భాల్లో అన్నదాతలకు బీమా ఎంతో ఊరట కలిగిస్తుంది. తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా రైతులకు భరోసా కల్పించినట్లు అవుతుంది. ఎంతో ప్రాముఖ్యం గల బీమా ప థకాన్ని నిర్లక్ష్యం చేకుండా అమలు చేయాల్సిన అవసరం ఉంది.
- బీమా పథకాన్ని అమలు చేయాలి
మెంగాజీ- రైతు
రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. అనుకోని సంఘటనలతో పంట నష్టపోయిన రైతులకు బీమా పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. గతంలో అధిక వర్షాలతో పంటలు నీట మునిగాయి. ఎలాంటి పరిహారం అందలేదు. పథకం ఉంటే కొంతలో కొంత అర్థిక నష్టం నుంచి బయటపడతాము.
ఇంకా ఆదేశాలు రాలేదు
- మిలింద్, ఏడీఏ, ఆసిఫాబాద్
పంటల బీమా అమలు కోసం ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదు. బీమా అమలైతే రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పంట నష్టపోయిన రైతుకు బీమా వర్తింపచేస్తే ఆర్థికంగా రైతులకు ఊరట కలుగుతుంది. ప్రభుత్వ ఆదేశాలు రాగానే బీమా అమలుకు సంబంధించి కార్యాచరణ చేపడతాము.