Share News

బిర్యాని.. బీ కేర్‌ఫుల్‌..

ABN , Publish Date - Apr 23 , 2025 | 11:41 PM

కొన్ని రెస్టారెంట్లలో తయారయ్యే బిర్యానీలో కుళ్లిపోయిన చికెన్‌, మటన్‌ను వండి వడ్డిస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. కొంతమంది హోటళ్ల యజమానులు హోల్‌సేల్‌గా మాంసాన్ని కొనుగోలు చేసి, రోజుల తరబడి నిల్వచేసి వంటకాలకు వినియోగిస్తున్నారు. దీంతో ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరి ఆరోగ్యానికి హానికరంగా మారే ప్రమాదం ఉంది.

బిర్యాని.. బీ కేర్‌ఫుల్‌..
జిల్లా కేంద్రంలో అధికారుల దాడుల్లో పట్టుబడ్డ కుళ్లిన చికెన్‌ (ఫైల్‌)

బిర్యాని.. బీ కేర్‌ఫుల్‌..

నిల్వ ఉంచిన మాంసంతో తయారీ

రెస్టారెంట్లు, హోటళ్లలో నాసిరకం ఆహారం

గతంలో అధికారుల దాడుల్లో వెలుగు చూసిన వైనం

జాగ్రత్త పడకపోతే ఆరోగ్యానికి ముప్పు

హోటళ్లలో దర్శనమిస్తున్న కుళ్లిన చికెన్‌..

కొన్ని రెస్టారెంట్లలో తయారయ్యే బిర్యానీలో కుళ్లిపోయిన చికెన్‌, మటన్‌ను వండి వడ్డిస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. కొంతమంది హోటళ్ల యజమానులు హోల్‌సేల్‌గా మాంసాన్ని కొనుగోలు చేసి, రోజుల తరబడి నిల్వచేసి వంటకాలకు వినియోగిస్తున్నారు. దీంతో ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరి ఆరోగ్యానికి హానికరంగా మారే ప్రమాదం ఉంది. దీనికి తోడు బిర్యానీలో నాసిరకం వెనిగర్‌, మసాలాలు వినియోగిస్తుండటంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చికెన్‌, మటన్‌ వంటకాలకు పిండితో రంగు వేసి తయారు చేయడం మరింత ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల బిర్యానీలో రుచి కోసం పశువుల కొవ్వునుంచి తయారు చేసిన నూనెను వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొవ్వు నూనె డాల్డాలో కల్తీ చేస్తుండటంతో చూసే వారికి అది డాల్డా లాగానే కనిపిస్తుందే తప్పా....కల్తీ జరిగిన విషయం పసిగట్టలేని విధంగా ఉంటుంది. కొవ్వు కరిగించిన నూనె అచ్చం స్వచ్ఛమైన నెయ్యిని పోలి ఉంటుంది. బ్రాండెడ్‌ కంపెనీలకు చెందిన వంటనూనె కిలో రూ.130 వర కు ధర ఉండగా, కల్తీనూనె కిలో రూ.50లకే లభి స్తుండటంతో హాటళ్లు, బిర్యానీపాయింట్‌ యజమాను లు కొందరు గుట్టుచప్పుడు కాకుండా ఈ నూనెనే వంటకాల్లో ఉపయోగిస్తున్నట్లు సమాచారం. రోడ్ల వెంట, ఫుట్‌పాత్‌లపై తయారుచేసే నూడుల్స్‌, ఫ్రైడ్‌ రైస్‌, చికెన్‌ పకోడి, కబాబ్‌, మంచూరియా తదితర ఆహారపదార్థాల తయారీలో సైతం కల్తీ నూనెను విరివిగావినియోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అధికారుల దాడుల్లో వెల్లడి....

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లలో అధికారుల దాడుల సందర్భంగా ఆహార పదార్థాల కల్తీ జరుగుతున్నట్లు గుర్తించారు. గతంలో రెవెన్యూ అధికారులు స్థానికంగా హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు నిర్వహించారు. దాడుల సందర్భంగా కుళ్లిన మాంసాన్ని బిర్యానీ తయారీకి ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. అధికారులకు ఓ హోటల్‌లో కుళ్లిన మాంసం లభించడంతో నమూనాలను ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం పంపించి హోటల్‌ను సీజ్‌ చేశారు. సదరు హోటల్‌లో రోజుల తరబడి పాలిథిన్‌ కవర్లలో నిలువ ఉంచిన చికెన్‌ లభ్యంకావడం విశేషం. అలాగే మరో హోటల్‌లో రోజుల తరబడి నిలువ ఉంచిన కుళ్లిపోయిన చికెన్‌ లభించడంతో హోటల్‌పై అధికారుల కేసు నమోదు చేశారు. తాజాగా రెండు రోజుల క్రితం ఐబీ చౌరస్తా సమీపంలోగల ఓ హోటల్‌ బిర్యానీలో కుళ్లిన చికెన్‌ ముక్క రావడంతో వినియోగదారులు ఆందోళనకు దిగారు. అయితే విషయం బయటకు పొక్కకుండా మేనేజ్‌ చేసినట్లు తెలిసింది.

- నిద్రావస్థలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు....

హోటళ్లు, రెస్టారెంట్లలో నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు....తదనంతరం కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే కల్తీ ఆహార పదార్థాల విక్రయానికి అడ్డుకట్ట పడటంలేదనే ఆరోపణలున్నాయి. జిల్లావ్యాప్తంగా బిర్యానీ తయారీకి భారీగా కల్తీ నూనె వినియోగిస్తున్నా ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు తప్పా అధికారులు తనిఖీలు చేపట్టడంలేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆహార తయారీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నాసిరకం నూనెలు, మసాలాలు వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఎప్పటికప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లో తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెలకోసారైనా తనిఖీలు నిర్వహించి అనుమానం ఉన్న ఆహార పదార్థాలను పరీక్షలకు పంపించాల్సి ఉన్నా అది జరగడంలేదు. ఆహార కల్తీకి సంబంధించి ప్రత్యేక చట్టం ఉన్నా ఆచరణలో అమలు కావడంలేదు. ఆహార కల్తీ నిరోధక చట్టం 1953ను ప్రభుత్వం ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2011గా మార్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్పులు, చేర్పులు చేపట్టిం ది. మార్చిన చట్టం ప్రకారం కల్తీ జరిగిన పక్షంలో భారీగా జరిమానాతోపాటు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే ఆహార తనిఖీ విభాగం అధికారులు చట్టాన్ని సక్రమంగా వినియోగించుకోకపోవడంతో కల్తీ రాయుళ్లు విచ్చలవిడిగా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - Apr 23 , 2025 | 11:41 PM