భూ సమస్యల పరిష్కారం కోసమే భూ భారతి
ABN , Publish Date - Apr 21 , 2025 | 10:39 PM
భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి ఆర్‌వోఆర్ నూతన చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. సోమవారం కాగజ్‌నగర్ వంజీరి రైతు వేదికలో భూ భారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

- కలెక్టర్ వెంటేష్ ధోత్రే
కాగజ్‌నగర్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి ఆర్‌వోఆర్ నూతన చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. సోమవారం కాగజ్‌నగర్ వంజీరి రైతు వేదికలో భూ భారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ భారతి చట్టం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రికార్డుల్లో ని తప్పుల సవరణకు తహసీల్దార్ కార్యాలయంలో సరిచేసుకునే అవకాశం కల్పించినట్టు తెలిపారు. ధరణి పోర్టల్ పార్ట్-బిలో ఉన్న భూములకు భూ భారతిలో పరిష్కరించేందుకు అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు. భూభారతిపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు.
ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ ధరణిలో పరిష్కారం కాని సమస్యలు భూ భారతితో పరిష్కారం అవుతాయన్నారు. ఈ చట్టం అమలు చేసేందుకు నిపుణులతో కమిటీ వేసినట్టు పేర్కొన్నారు. సులభమైన పద్ధతి ద్వారా పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్రధానంగా అర్జి విధానంతో స్థానికంగా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. తహసీల్దార్ స్థలాన్ని పరిశీలించేందుకు, భూ సర్వే చేసేందుకు అన్ని హక్కులు కల్పించినట్టు పేర్కొన్నారు.
సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ధరణి కేవలం సీఎం కేసీఆర్, వారి కుటుంబసభ్యుల కోసం చేసుకున్నదేనని అన్నారు. ధరణితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం జరిగినట్టు తెలిపారు. ధరణి పేరిట దోపిడి చేసుకున్నట్టు తెలిపారు. కొత్తగా వచ్చిన చట్టంలో మార్పులు రావటం శుభపరిణామన్నారు. ఈ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లా, తహసీల్దార్ కిరణ్ కుమార్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.