‘రాజీవ్ యువ వికాసం’ అర్హుల జాబితా రూపొందించాలి
ABN , Publish Date - Apr 21 , 2025 | 10:41 PM
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హుల జాబితా రూపొందించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేవ మందిరంలో దరఖాస్తుల పరిశీలన మార్గదర్శకాలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, బ్యాంకు మేనేజర్లు, ఏపీఎంలు, కార్పొరేషన్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హుల జాబితా రూపొందించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేవ మందిరంలో దరఖాస్తుల పరిశీలన మార్గదర్శకాలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, బ్యాంకు మేనేజర్లు, ఏపీఎంలు, కార్పొరేషన్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకంలో అందిన దరఖాస్తుల పరిశీలన పార్దర్శకంగా నిర్వహించి అర్హులైన వారి జాబితా రూపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో ఎంపీడీవోలు, బ్యాంకు మేనేజర్లు కమిటీ సభ్యులు తమ మండలంలోని కార్యాచరణ రూపొందించుకుని ప్రతీ దరఖాస్తును పరిశీలించి అర్హులైన వారి జాబితా రూపొందించాలని తెలిపారు. మే 15వ తేదీ వరకు సర్వే ప్రక్రియ పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీకి జాబితా అందించాలని ఆదేశించారు. బ్యాంకర్ల సమన్వయంతో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు, పట్టాదారు పాసు పుస్తకం, సదరం సర్టిఫికేట్, ఇతర ధ్రువపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు. జనాభా ప్రాతిపదికన యూనిట్ల కేటాయింపు ఉంటుందని, ఒకే గ్రామంలో ఒక యూనిట్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించాలని, ఆయా కార్పొరేషన్ల అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో పాల్గొనాలని తెలిపారు. మండల కమిటీ నుంచి జాబితా వచ్చిన అనంతరం మే 21 నుంచి 30 వరకు జిల్లా స్థాయి కమిటీ పరిశీలన తరువాత అర్హులైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న మంజూరు పత్రాలు అందజేస్తామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అదికారి దత్తారావు, గిరిజనాభివృద్ది అధికారి రమాదేవి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సజీవన్, లీడ్ బ్యాంకు మేనేజర్ రాజేశ్వరిజ్యోషి, తదితరులు పాల్గొన్నారు.