చదివిన డిగ్రీ ఒకటి.. వైద్యం మరొకటి
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:39 PM
జిల్లాలో వైద్యం విచ్చలవిడిగా మారింది. అర్హతలు లేకున్నా వైద్య చికిత్సలు చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. తెలిసీ తెలియని వైద్యం చేస్తూ స్థానిక డాక్టర్లు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం అనుమానాలకు దారి తీస్తోంది.

- జిల్లాలో విచ్చలవిడిగా వైద్య సేవలు
- ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు వైద్యులు
- అడ్డగోలుగా ఆసుపత్రులకు అనుమతులు జారీ
- అనర్హులపై టీఎంసీ కొరడా
మంచిర్యాల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైద్యం విచ్చలవిడిగా మారింది. అర్హతలు లేకున్నా వైద్య చికిత్సలు చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. తెలిసీ తెలియని వైద్యం చేస్తూ స్థానిక డాక్టర్లు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం అనుమానాలకు దారి తీస్తోంది. ఎంబీబీఎస్ అర్హలతో ఏకంగా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు నడిపేవారు కొందరైతే...తాను చదువుకున్న డిగ్రీని కాదని, మరో విభాగంలో చికిత్స అందిస్తున్న వారు మరికొందరు ఉన్నారు.
- విచ్చలవిడిగా అనుమతులు...
రాష్ట్రంలో వైద్య విద్యలో ఎంబీబీఎస్‌తోపాటు ప్రత్యేక విభాగాల్లో పీజీ చేసిన వారికి ఆసుపత్రులు ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఆ ధ్రువీకరణ పత్రం ఉంటేనే వైద్య ఆరోగ్యశాఖ అనుమతులు ఇవ్వాలనే నిబంధన ఉంది. అంతేగాకుండా ప్రతి ఐదేళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ అనుమతులను రెన్యూవల్ కూడా చేసుకోవలసి ఉంటుంది. అయితే ఇవేమీ పట్టని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రైవేటు ఆసుపత్రులకు విచ్చలవిడిగా అనుమతులు మంజూరు చేస్తోందన్న అపవాదు ఉంది. అర్హత సర్టిఫికేట్లను పూర్తిగా పరిశీలించకుండానే అనుమతులు మంజూరు కావడంతో కొందరు వైద్యులది ఆడిందే ఆటగా తయారైంది. ఇదే తరహాలో జిల్లా కేంద్రంలోని ఐబీ సమీపంలోగల ఓ ప్రముఖ వైద్యుడు నడుపుతున్న ఆసుపత్రికి వైద్య ఆరోగ్యశాఖ అనుమతులు జారీ చేసింది. అదికూడా సదరు వైద్యుడు చేసిన డిగ్రీ ఒకటైతే... మరో విభాగంలో చికిత్సకు అనుమతులు జారీ చేయడం కొసమెరుపు. ఆసుపత్రుల కేటాగిరీని బట్టి వివిధ రకాల ధరలు నిర్ణయించి, నిబంధనలకు విరుద్దంగా అనుమతులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. స్కానింగ్ సెంటర్లకు అనుమతులు జారీ చేసేందుకు వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఐబీ సమీపంలోగల అర్హతలేని వైద్యుడికి కూడా అనుమతులు మంజూరైనట్లు తెలుస్తోంది.
- నోటీసు జారీతో వెలుగులోకి...
జిల్లాలో ఎలాంటి అర్హతలు లేకుండా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు నిర్వహిస్తున్న వారిపై టీజీఎంసీ కొరడా ఝళిపిస్తోంది. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ సదరు నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తోంది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని ఐబీ సమీపంలో నిర్వహిస్తున్న ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికీ నోటీసులు జారీ చేసింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి 24-04-2025న ఐబీ ప్రాంతంలోని సర్జికల్, లాపరోస్కోపిక్, మెటర్నిటీ, కిడ్నీ సెంటర్‌ను ఆశ్రయించారు. అతన్ని పరీక్షించిన ఆసుపత్రి వైద్యుడు (జనరల్ సర్జన్) బాధిత వ్యక్తికి కిడ్నీ చికిత్స అందిచారు. వైద్యం బెడిసికొట్టడంతో బాధితుడు తీవ్ర నొప్పితో బాధపడుతూ మరోచోట చికిత్స తీసుకున్నారు. సదరు వైద్యుడు ఎలాంటి అర్హత లేకుండా యూరాలజీ విభాగంలో వైద్యం చేసి అనారోగ్యంపాలు చేశాడని పేర్కొంటూ బాధితుడు టీజీఎంసీకి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన టీజీఎంసీ వైద్యుడి గురించి ఆరా తీస్తే అర్హత లు లేనట్లుగా తేలింది. వైద్యుడు ఎంబీబీఎస్‌తోపాటు జనరల్ సర్జన్ పట్టా పొందినప్పటికీ ఎంబీబీఎస్ వరకే టీజీఎంసీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తేలింది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేయించాల్సి ఉండగా, అదికూడా చేయలేదని సమాచారం. పైగా యూరాలజీ విభాగంలో చికిత్సలు అందిస్తు న్నట్లు గుర్తించిన టీజీఎంసీ తదుపరి విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు జూన్ 23న నోటీసు జారీ చేసింది. టీజీఎంసీ నిబంధనలకు విరుద్ధంగా చికిత్స అందిస్తున్న వైద్యుడిని చట్ట ప్రకారం సస్పెండ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, టీజీఎంసీ జిల్లా వ్యాప్తంగా పలు ఆసుపత్రులు నిర్వహించే వైద్యులకు నోటీసులు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 281 ప్రైవేటు ఆసుపత్రులు ఉండగా, వాటిని నిర్వహిస్తున్న వారిలో సింహభాగం అర్హతలేని వారే ఉన్నట్లు సమాచారం.
మచ్చుకు కొన్ని సంఘటనలు...
- ఐదారు నెలల క్రితం జిల్లా కేంధ్రంలోని గవర్నమెంట్ డిస్ట్రిక్ హాస్పిటల్ సమీపంలోగల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. క్వాలిఫైడ్ వైద్యులులేక ఆసుపత్రిలోనే గంటలకు గంటలు ఉంచగా, కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ విషయమైనా టీజీఎంసీ నోటీసులు ఇవ్వగా, క్వాలిఫైడ్ డాక్టర్లు లేరని స్పష్టమైంది.
- జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా సమీపంలోగల ఓ ఆసుపత్రిలో వైద్యుడు కార్డియాలజీ విభాగంలో చికిత్స అందించేవాడు. ఓ రోగికి ఇచ్చిన చికిత్స కారణంగా అది బెడిసి కొట్టడంతో ఆయన బందువులు, వైద్యుడి మధ్య తీవ్ర గొడవకు దారి తీసింది. బంధువులు వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా, తనిఖీలు చేయడంతో సదరు వైద్యుడికి ఎంబీబీఎస్ మినహా, పీజీ అర్హత లేదని రుజువైంది. దీంతో సదరు ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు.
- జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా సమీపంలోగల ఓ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్యుడికి కేవలం ఎంబీబీఎస్ అర్హతలు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ అతడు ఎండీ ఫిజీషియన్ విభాగంలో కూడా చికిత్సలు అందించేవాడు. ఈ క్రమంలో టీజీఎంసీ నోటీసులు జారీ చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఇలా జిల్లా వ్యాప్తంగా పలు ప్రత్యేకలతో నడుస్తున్న వివిధ ఆసుపత్రుల్లో అర్హతలులేనివారే చికిత్సలు అందిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ లోతుగా పరిశీలిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.