వెనకబడిన వర్గాల సంక్షేమానికి 11,405 కోట్లు
ABN , Publish Date - Mar 20 , 2025 | 05:57 AM
వెనకబడిన వర్గాల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.11,405 కోట్లు కేటాయించారు. కులగణన సర్వే నివేదిక ఆధారంగా విద్యా, ఉద్యోగరంగాలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు నిర్ణయించి ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు నిధులు కేటాయించారు.

గత ఏడాదికన్నా రూ.2,205 కోట్లు అదనం
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): వెనకబడిన వర్గాల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.11,405 కోట్లు కేటాయించారు. కులగణన సర్వే నివేదిక ఆధారంగా విద్యా, ఉద్యోగరంగాలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు నిర్ణయించి ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు నిధులు కేటాయించారు. గత ఏడాది బీసీ సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో రూ.9,200 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.2,205 కోట్లు అదనంగా ప్రతిపాదించారు. ఇందులో వెనకబడిన వర్గాల సంక్షేమ పథకాల కోసమే రూ.10,397.15 కోట్లు, నిర్వహణ కింద రూ.1,008 కోట్లు కేటాయించారు. ఇక వివిధ కులాలకు చెందిన ఒక్కో కార్పొరేషన్‌కు ఈసారి రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు.
వాల్మీకిబోయ, కృష్ణబలిజ, వడ్డెర, విశ్వబ్రాహ్మణ, భట్రాజు, శాలివాహన, సగర, మున్నూరుకాపు తదితర ఆర్థిక సహకార సంస్థలకు భారీగా నిధులు కేటాయించారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు, నాయిబ్రాహ్మణ కార్పొరేషన్‌కు విద్యుత్ చార్జీల రాయితీ కోసం రూ.100 కోట్లు కేటాయించారు. చేపల పెంపకం, మహిళలకు పంపిణీ చేసేందుకు చేనేత కార్మికులకు చీరల తయారీకి ఆయా పథకాల కింద నిధులు ఖర్చు చేయనున్నారు. స్వయం ఉపాధి పథకాలు, ఆర్థిక సాయం అందించే రాజీవ్ యువవికాసం, కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాల కోసం రూ.400 కోట్లు కేటాయించారు.